ఈటల రాజేందర్ ఒక మేకవన్నె పులి. బలహీన వర్గాల ముసుగులో ఉన్న పెద్ద దొర. ఆయన హుజురాబాద్‌కు వెళ్తే బీసీ.. హైదరాబాద్‌కు వస్తే ఓసీ అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ భవన్లో మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు.అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డితో, కిరణ్ కుమార్‌రెడ్డితో తాను మాట్లాడాను అని ఈటల చెబుతున్నారు. కేవలం దేవరయాంజల్ భూముల కోసమే ఆయన మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం గురించి ఆయన ఏనాడూ అసెంబ్లీలో మాట్లాడలేదు. ముదిరాజ్‌లకు చేప పిల్లలు ఇవ్వాలని ఎప్పుడైనా కేసీఆర్‌ను రాజేందర్ కోరరా? అని ప్రశ్నించారు. ముదిరాజ్‌లు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ వారికి చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేశారు. ఇవాళ పదవి పోగానే ముదిరాజ్‌లు గుర్తుకు వస్తున్నారు. పదవిలో ఉన్నప్పుడు ముదిరాజ్‌లను ఎందుకు దగ్గరకు తీయలేదు? అని మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు.
2001లో టీఆర్ఎస్ పార్టీ స్థాపిస్తే.. ఈటల రాజేందర్ 2003లో పార్టీలో చేరారు. కేసీఆర్ ఈటలకు అన్ని రకాల పదవులు ఇచ్చారు. ఈటలను సొంత తమ్ముడిలా భావించి సీఎం కేసీఆర్ ఆదరించారు. 2018 ఎన్నికల్లో బీసీ నాయకుడిని ఓడగొట్టే ప్రయత్నం చేశాడు. అది సరికాదు. కల్యాణలక్ష్మి వద్దంటావు. ఆసరా పెన్షన్లు పరిగే అంటావు. ప్రభుత్వ పథకాలను విమర్శించారు. పార్టీలో తిరుగుబాటు తీసుకొచ్చేందుకు ఈటల ప్రయత్నించారు. అయినప్పటికీ ఆయన గౌరవానికి భంగం కలగొద్దని పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
హుజురాబాద్‌లో బీసీలను అణగతొక్కారు.
సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్నానని చెప్పిన ఈటల.. ఇంత తక్కువ సమయంలో వేల ఎకరాల భూములు, వేల కోట్ల రూపాయాలు ఎలా సంపాదించాడు. మెడికల్ కాలేజీ ఎలా వచ్చింది. పార్టీ అన్ని అవకాశాలు ఇచ్చి, ప్రభుత్వంలో అన్ని రకాల పదవులు ఇచ్చినందుకే ఇవన్నీ సాధ్యమయ్యాయి. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిందని బాధ పడిన వ్యక్తి ఈటల రాజేందర్ అని తెలిపారు.
ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఆరుసార్లు తాను గెలిచానని చెప్పడం కాదు.. కేసీఆర్ బొమ్మ మీదనే గెలిచావు. టీఆర్ఎస్ పార్టీ అన్ని ఎన్నికల్లో గెలుస్తుందంటే.. దానికి కారణం కేసీఆర్ బొమ్మ అని స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ కోట్ల ఆస్తులు ఎలా సంపాదించాడో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందన్నారు. కేసీఆర్ ఒక లెజెండ్.. ఒక శక్తి అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.