దేశంలో కరోనా మరణ మృదంగం మోగిస్తున్నది. రోజువారీ పాజిటివ్ కేసులతో పాటు రికార్డు స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొవిడ్ రోజువారీ కేసులు దేశంలో కొత్తగా దాదాపు మూడు లక్షలకు చేరువవగా.. 2,023 మంది మరణించారు. కరోనా మహమ్మారి ప్రారంభం నుంచి ఇంత మొత్తంలో కరోనా కేసులు, మరణాలు నమోదవడం ఇదే తొలిసారి. 24 గంటల్లో 2,95,041 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,56,16,130కు పెరిగింది. కొత్తగా 1,67,457 మంది డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 1,32,76,039 మంది కోలుకున్నారు. మహమ్మారి బారినపడి మొత్తం 1,82,553 మంది ప్రాణాలు విడిచారు.
ప్రస్తుతం దేశంలో 21,57,538 యాక్టివ్ కేసులున్నాయని చెప్పింది. టీకా డ్రైవ్లో భాగంగా ఇప్పటి వరకు 13,01,19,310 టీకా డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది. ఇదిలా ఉండగా నిన్న ఒకే రోజు 16,39,357 నమూనాలను పరిశీలించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. నిన్నటి వరకు 27,10,53,392 నమూనాలను పరిశీలించినట్లు ఐసీఎంఆర్ వివరించింది.