దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గతేడాది ఈ మహమ్మారి పెద్దలపై విరుచుకుపడగా, సెకండ్ వేవ్‌లో మాత్రం చిన్నారులపై కోరలు చాచి బుసలు కొడుతోంది. నెల రోజుల వ్యవధిలోనే దేశ వ్యాప్తంగా 79,688 మంది చిన్నారులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మార్చి 1 నుంచి ఏప్రిల్ 4వ తేదీ మధ్యలో ఒక్క మహారాష్ర్టలోనే 60,684 మంది చిన్నారులకు కరోనా సోకింది. ఇందులో ఐదేళ్ల లోపు చిన్నారులు 9,882 మంది ఉన్నట్లు పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌లో 5,940 మంది పిల్లలకు కరోనా వ్యాప్తి చెందగా, 922 మంది చిన్నారులు ఐదేళ్ల లోపు వారు ఉన్నారు. కర్ణాటకలో 7,327(ఐదేళ్ల లోపు చిన్నారులు 871), ఉత్తరప్రదేశ్‌లో 3,004(ఐదేళ్ల లోపు చిన్నారులు 471) మంది పిల్లలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి ఉందని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఢిల్లీలో 2,733 మంది పిల్లలు కరోనా బారిన పడగా, ఐదేళ్ల లోపు చిన్నారులు 441 మంది ఉన్నారు. అయితే కరోనా సోకిన చిన్నారుల్లో అత్యధికులు పేదరికం నుంచి వచ్చిన వారే ఉన్నారు. ఇక చిన్న పిల్లలకు ఆస్ర్టాజెనీకా టీకా అందుబాటులోకి వచ్చినప్పటికీ, దాని వల్ల చిన్నారుల్లో బ్లడ్ క్లాటింగ్ అవుతుండటంతో ఆ టీకాను నిలిపివేశారు. యూరప్‌లో ఈ టీకా తీసుకున్న చిన్నారుల్లో ఏడుగురు చనిపోయారు.