ఉద్యోగుల సంక్షేమాన్ని ఎల్లప్పుడూ ఆకాంక్షించే ప్రభుత్వం తమదని, అందుకే అందరికీ ఆమోదయోగ్యమైన ఫిట్ మెంట్ ను ఇస్తూ పీఆర్సీపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని అన్నారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. పీఆర్పీని ఆహ్వానిస్తూ అరణ్య భవన్ లో ఉద్యోగుల సంబరాల్లో మంత్రి పాల్గొన్నారు.
ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగుల పట్ల సీఎం కేసీఆర్ పక్షపాతి అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ది గల వ్యక్తని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఉద్యోగులు ముందుండాలని, వారి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ముందుంటుందన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్. శోభ ఉద్యోగుల తరపున ప్రభుత్వానికి, మంత్రి హరీష్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్సవాల్లో పాల్గొన్న అటవీ శాఖ ఉద్యోగులు, సిబ్బంది, వివిధ సంఘాల నేతలు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.