ఒక నటిగా తననుతాను నిరూపించుకునేందుకు ప్రతినాయక పాత్రలను సైతం చేసేందుకు సిద్ధమని హీరోయిన్ రెజీనా కెసాండ్రా పేర్కొంది. హీరో విశాల్ నటించిన తాజా చిత్రం ‘చక్ర’. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌ను తెచ్చుకుంది. ఈ చిత్రంలో విలన్ పాత్రలో హీరోయిన్ రెజీనా నటించగా, ఆమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో ముచ్చటించారు. ఆమె మాట్లాడుతూ.. ఒక నటిగా ఇలాంటి పాత్రలకు తాను కూడా సరిపోతానని భావించడం వల్లే ఈ అవకాశం వచ్చిందని చెప్పింది. ఖచ్చితంగా ఒక నటిగా తనను తాను మెరుగుపరుచుకునేందుకు ఇలాంటి పాత్రలు ఎంతో దోహదం చేస్తాయని తెలిపింది. విలన్‌గా తన పేరును ఎవరు సిఫార్సు చేశారో సరిగ్గా తెలియదని,.. కానీ, దర్శకుడు ఆనందన్ ఈ చిత్ర కథను వివరించారని చెప్పింది. తమిళంలో ఇలాంటి పాత్రలు ఇప్పటివరకు చేయలేదని, కానీ, తెలుగులో మాత్రం ‘ఎవరు’ అనే చిత్రంలో నటించినట్టు రెజీనా చెప్పింది. ‘చక్ర’ చిత్రంలో తన పాత్ర గురించి వివరిస్తూ, సమాజంలోని ప్రతి ఒక్కరూ వారివారి స్వలాభాల కోసం వెంపర్లాడుతుంటే తాను కూడా ఎందుకు అలా వుండకూడదనే బలమైన ఆలోచన మనసులో నాటుకుని పోయే పాత్ర అని, తనను తాను నిరూపించుకునేందుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న పట్టుదలతో నటించినట్టు ఆమె తెలిపింది.
ఇలాంటివి అరుదుగా వస్తాయి
పోలీస్ వంటి పాత్రలు ఇప్పుడు కాకుంటే మరోమారు వచ్చే అవకాశం ఉందని, కానీ, ‘చక్ర’లాంటి చిత్రంలో ప్రతినాయక పాత్రలో నటించే చాన్సు రావడం అనేది చాలా చాలా అరుదని ఆమె చెప్పింది. అయితే, తన పాత్రకు డైలాగులు పెద్దగా లేవనే కామెంట్స్‌పై ఆమె స్పందిస్తూ, ఈ పాత్రకు డైలాగులు తక్కువగా రాశారని, కళ్ళతోనే హావభావాలు పలికించేలా దర్శకుడు తన పాత్రను రూపకల్పన చేశారని చెప్పింది. విలన్ పాత్రలు చేయడం వల్ల భవిష్యత్తులో కూడా ఇలాంటి పాత్రలే వస్తాయి కదా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ, అలా ఎందుకు అనుకోవాలి… ఇలాంటి పాత్రలతో పాటు ఇతర పాత్రలు వచ్చినా ఒక నటిగా తమను తాము నిరూపించుకునేందుకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పింది. డిజిటల్ టెక్నాలజీపై మీ అభిప్రాయం ఏంటనే ప్రశ్నకు రెజీనా బదులిస్తూ, టెక్నాలజీతో మంచి, చెడు రెండూ సమపాళ్ళలో ఉన్నాయని, ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి సమయంలో డిజిటల్ టెక్నాలజీపై ప్రజల్లో మంచి అవగాహన ఏర్పడిందని తెలిపింది.
ఓటీటీకి సంపూర్ణ మద్దతు
థియేటర్లకు ప్రత్యామ్నాయంగా ఓటీటీ ఫ్లాట్‌ఫాం రావడాన్ని తాను సంపూర్ణంగా ఆహ్వానిస్తానని రెజీనా చెప్పింది. ప్రత్యామ్నాయ టెక్నాలజీ వస్తే ఖచ్చితంగా స్వాగతించాలని, ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో సినీపరిశ్రమను ఓటీటీ రక్షించిందని, అదేసమయంలో ఓటీటీ ప్రసారాలకు కూడా నియంత్రణ వుండాలని చాలామంది అభిప్రాయడుతున్నారని, ఈ విషయంలో సెన్సార్ బోర్డే నిర్ణయం తీసుకోవాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ‘శూర్పణఖ’ అనేది కేవలం చిత్ర టైటిల్ మాత్రమేనని, చిత్రంలో విలనిజం పాత్ర వుండదని, ఇందులో ఆర్కియాలజిస్టుగా నటిస్తున్నట్టు ఆమె చెప్పింది. ‘నెంజం మరప్పదిల్లై’ అనే చిత్రం కోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నట్టు, ఈ చిత్ర దర్శకుడు సెల్వరాఘవన్ ఏదో మ్యాజిక్ చేశారని అమె చెప్పింది.
కొత్త పాత్రల్ని వదులుకోను..
కొత్త పాత్రలు వస్తే ఆ అవకాశాన్ని వదులుకోనని రెజీనా తెలిపింది. ‘నెంజం మరప్పదిల్లై’ చిత్రంలో దర్శకుడు సెల్వరాఘవన్‌తో కలిసి పనిచేయడం సరికొత్త అనుభూతినిచ్చిందని చెప్పింది. ఇకపోతే, తెలుగులో సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌లో చిత్రంలో నటించనున్నట్టు తెలిపింది. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ కొరియన్ మూవీ తెలుగులోకి రీమేక్ చేయనున్నారని, ఇందులో నటిస్తున్నట్టు చెప్పింది. అలాగే, సోనీలైవ్ నిర్మాణ సంస్థ రూపొందించే ఓ వెబ్‌సిరీస్‌లో కూడా నటిస్తున్నట్టు, ఇది బయోగ్రఫీ సిరీస్ అని, ఇవికాకుండా మూడు తమిళ చిత్రాల్లో నటిస్తున్నట్టు రెజీనా వివరించింది. కాగా 2005లో వచ్చిన ‘కండ నాళ్ ముదల్’ అనే చిత్రంతో రెజీనా కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
Source:- Exclusive Interview With ABN