కరోనా కారణంగా వైద్యరంగంలో సమూల మార్పులు వచ్చాయని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అన్నారు. మార్పులను కొనసాగిస్తూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వైద్యసేవల రంగంలో ప్రవేశపెట్టాలని పిలుపునిచ్చారు. వైద్య సిబ్బందిపై ఒత్తిడి తగ్గిస్తూ, రోగులకు ప్రయోజనం చేకూర్చేలా కృత్రిమ మేధ, హాలోగ్రామ్ వంటి టెక్నాలజీలను ప్రోత్సహించాలని సూచించారు. బయోఏషియా-2021 సదస్సు రెండోరోజు ‘హెల్త్‌కేర్ టు హిట్ రిఫ్రెష్’ అంశంపై చర్చలో సత్య నాదెళ్ల, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు పాల్గొన్నారు. వైద్యరంగంపై కరోనా ప్రభావం, భవిష్యత్తు వైద్య విధానాలు, స్టార్టప్‌ల పాత్ర తదితరాలపై చర్చించారు.
వైద్యరంగంలో అత్యాధునిక టెక్నాలజీని ప్రవేశపెట్టడంలో స్టార్టప్‌లు కీలకంగా వ్యవహరించాయని సత్య నాదెళ్ల అభినందించారు. ‘కంప్యూటింగ్ విత్ బయాలజీ’తో అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయన్నారు. ఏ టెక్నాలజీ అయినా దాని ఫలాలు సామాన్యుడికి చేరినప్పుడే సార్థకత చేకూరుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే చెప్తుంటారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం సామాన్యులను దృష్టిలో పెట్టుకొని అనేక సాంకేతిక విధానాలను అమలు చేస్తున్నదని చెప్పారు. ఐదేండ్ల క్రితం హైదరాబాద్‌లోని టీహబ్‌ను సందర్శించిన విషయాన్ని సత్యనాదెళ్ల గుర్తుచేయగా.. మరోసారి సందర్శించాలని కేటీఆర్ ఆహ్వానించారు. అందుకు సత్య సానుకూలంగా స్పందించారు. సత్య నాదెళ్ల, కేటీఆర్ ముఖాముఖి వారి మాటల్లోనే..
కేటీఆర్: కరోనా ప్రపంచ గమనాన్నే మార్చివేసింది. ఈ విపత్తు నుంచి మనం ఏం నేర్చుకున్నాం? తర్వాత పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి?
సత్య నాదెళ్ల: హైదరాబాద్‌లో సమావేశం అనగానే నాకు ఎల్లప్పుడూ కొత్త ఉత్సాహం వస్తుంది. కరోనాతో డిజిటలైజేషన్ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం మనం వాడుతున్న టెక్నాలజీ ఈ సమయానికి అందుబాటులో లేకుంటే ప్రపంచం ఎలా ఉండేదో అన్న ఊహే నన్ను భయపెడుతున్నది. నాకు తెలిసి మనం ఇక వెనుదిరిగి చూసే అవకాశాలు తక్కువే. టెక్నాలజీ మన జీవితంలో మరింత బలంగా భాగస్వామి కానుంది. వైద్యరంగంలో కృత్రిమ మేధ వినియోగం పెరుగుతుంది. టెలిమెడిసిన్ అభివృద్ధి చెందుతుంది. అత్యవసరమైతే తప్ప దవాఖానకు వెళ్లాల్సిన పనిలేని రోజులు వస్తాయి. ఖర్చు కూడా తగ్గుతుంది. రోగి, అతడి కుటుంబ సభ్యుల బాగోగులను టెక్నాలజీ సాయంతో చూసుకోగలిగితే ఫ్రంట్‌లైన్ వారియర్స్‌పై ఒత్తిడి తగ్గుతుంది. కరోనా విపత్తు ప్రారంభమైన మొదటి రోజుల్లో మేము ‘అడాప్టివ్ బయోటెక్’ అనే కంపెనీతో కలిసి పనిచేశాం. వైరస్‌కు మన శరీర రక్షణ వ్యవస్థ ఎలా స్పందిస్తుందో ఈ సంస్థ పరిశోధనలు చేస్తున్నది. తద్వారా వైరస్‌కు విరుగుడు కనిపెట్టడం సులభతరం, వేగవంతం అవుతుంది. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు ఎదురైతే ఎలా ఎదుర్కోవాలనే అంశంపై నేను ఆలోచిస్తున్నా. ఏదేమైనా మనం సంసిద్ధంగా ఉండాలి.
కేటీఆర్: సమాజంపై సానుకూల ప్రభావం చూపలేని టెక్నాలజీ విఫలమైనట్టేనని సీఎం కేసీఆర్ తరుచూ చెప్తుంటారు. ఇప్పుడున్న వర్చువల్ టెక్నాలజీతో పనివిధానంలో ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు?
సత్య నాదెళ్ల : టెక్నాలజీతో ‘ఫ్లెక్సిబిలిటీ’ రావాలి. సమయం, ప్రాంతంతో సంబంధం లేకుండా పని పూర్తిచేయగలిగే ఫ్లెక్సిబిలిటీ రావాలి. నిపుణుల సాయం కావాలంటే హాలోగ్రామ్ లేదా ఇతర మార్గాల్లో తీసుకోగలగాలి. డిజిటల్ వేదికగా చాలా మంది అనుసంధానం అవుతున్నారు. వారు ఒకరితో ఒకరు సంభాషించడం ద్వారా నేర్చుకొనే విధానం రావాలి. వ్యక్తులకైనా, సంస్థకైనా నిరంతర అభ్యాసమే విజయసూత్రం. కాబట్టి రోజూ కొత్తగా ఏం నేర్చుకున్నామో విశ్లేషించుకొనే వ్యవస్థ రావాలి. ఉద్యోగుల పట్ల ప్రేమగా ఉండాలి. అప్పుడే ఎక్కడ ఉండి చేసినా మెరుగైన పనితీరు కనబరుస్తారు.
కేటీఆర్: దశాబ్ద కాలంగా స్టార్టప్‌ల ప్రాధాన్యం పెరిగింది. మీరు కూడా అనేక స్టార్టప్‌ల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. భవిష్యత్తు వ్యాపార రంగాన్ని బయో స్టార్టప్‌లు ఏ విధంగా మార్చబోతున్నాయి?
సత్యనాదెళ్ల: నేను ఐదేండ్ల కిందట మీతో కలిసి టీహబ్‌ను సందర్శించాను. మీరన్నది నిజమే.. బయాలజీ, కంప్యూటింగ్ తోడైతే ఆవిష్కరణల పరంగా ఎన్నో సాధించవచ్చు. స్టార్టప్‌లు ఈ అంశంపై దృష్టిపెట్టాలి. ఈ దిశగా పెట్టుబడులు వస్తుండటం అభినందించదగ్గ విషయం. నేను భారత్‌కు చెందిన ‘సైమెట్రిక్’ స్టార్టప్‌పై ఆసక్తిగా ఉన్నాను. క్లినికల్ ట్రయల్స్ విధానాన్నే మార్చడంపై వారు కృషి చేస్తున్నారు. ఇవేకాకుండా ఫోన్‌కాల్‌తో వైద్యసేవలు పొందే టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చారు. అపోలో హాస్పిటల్ 24 గంటల కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఇలాంటి ఎన్నో కొత్త అంశాలను సార్టప్‌లు ఆవిష్కరిస్తున్నాయి. తక్కువ ఖర్చులో వైద్యసేవలు అందించే ‘99 డాట్స్’ అనే ప్రోగ్రామ్‌ను మెడికల్ అధెరెన్స్ టెక్నాలజీ అనే స్టార్టప్ తయారుచేసింది. కాబట్టి భవిష్యత్తులో వైద్యవిధానాలన్నీ టెక్నాలజీకి ముడిపడి ఉంటాయని నా నమ్మకం.
కేటీఆర్: ప్రస్తుతం మనందరం సోషల్ మీడియా యాప్స్, ఫిట్నెస్ ట్రాకర్స్ వాడుతున్నాం. మరి మన డాటా రక్షణ, గోప్యత సంగతేంటి? ఎలాంటి చర్యలు అవసరం?
సత్యనాదెళ్ల: గోప్యత మానవుడి హక్కు. టెక్నాలజీని లేదా ఉత్పత్తిని తయారు చేస్తున్న సంస్థలే గోప్యత, రక్షణ బాధ్యతలు తీసుకోవాలి. అది ధర్మం. ఇంటర్నెట్ సేఫ్టీ, ఏఐ ఎథిక్స్‌కు విధివిధానాలు రూపొందించుకోవాలి. దీంతోపాటు ప్రభుత్వాలు తగిన నిబంధనలు రూపొందించాలి.
Source : నమస్తే తెలంగాణ