సిద్ధిపేటలో కొత్త మోడ్రన్ బస్టాండ్ నిర్మింప చేసేందుకు, స్థానిక పాత బస్టాండ్ ఆధునీకరణ పై రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రయాణీకులకు సౌకర్యంగా ఉండే వీలుగా ముందు చూపుతో నిర్మాణం జరపాలని నిర్ణయించినట్లు, విజన్ కు అనుగుణంగా బస్టాండ్ నిర్మాణం ఉండాలని ఆర్కిటెక్ట్, ఆర్టీసీ అధికారులకు మంత్రి హరీశ్ రావు దిశానిర్దేశం చేశారు.
ఈ మేరకు సోమవారం ఉదయం పాత బస్టాండ్- ఆవరణ, పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో ఆర్టీసీ ఈఈ రాంబాబు, ఆర్ఏం రాజశేఖర్, ఆర్కిటెక్ట్ ప్రీతమ్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. యేడాది లోపు మోడ్రన్ బస్టాండ్ అందుబాటులో తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆర్కిటెక్ట్, ఆర్టీసీ అధికారులను మంత్రి ఆదేశించారు. 1976లో నిర్మించిన బస్టాండులో నూతనంగా రూ.5 కోట్ల ప్రభుత్వ నిధులతో మోడ్రన్ బస్టాండ్ నిర్మాణం చేపడుతున్నట్లు ఆర్టీసీ అధికార వర్గాలతో మంత్రి చర్చించారు.
బస్టాండుకు వచ్చే ప్యాసింజర్లు-ప్రయాణీకులకు మోడ్రన్ టాయిలెట్స్, క్యాంటీన్, దుకాణ సముదాయం, బస్టాండులో దాదాపు 20 వరకూ ప్లాట్ ఫామ్స్ వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆర్టీసీ అధికార వర్గాలు మంత్రికి వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరామ్, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.