ఒకవైపు సంక్షేమంలో మరోవైపు అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ ఒన్ స్థానంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కొనియాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు నిధులు ఇవ్వకుండా తొక్కేయాలని చూస్తు న్నా, రాష్ట్రాభివృద్ధికి అవార్డులు ఇవ్వకుండా ఉండలేని పరిస్థితి అని వ్యాఖ్యానించారు.
శనివారం బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో సీఎం కేసీఆర్ విధానాలపై ప్రముఖ కవి, రచయిత జూలూరు గౌరీశంకర్ రచించిన ‘ఒక్కగా నొక్కడు’ వ్యాస సంకలనాన్ని ఆయన ఆవిష్కరించారు.
అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో అహరహం శ్రమించిన ప్రతి ఒక్కరి పోరాట జ్ఞాపకాలను గ్రంథస్థం చేయాల్సిందిగా రచయితను కోరారు. కేసీఆర్ పరిపాలనా దక్షతను కళ్లకు కట్టే ‘ఒక్కగానొక్కడు’ పుస్తకం ప్రతి పంచాయతీకి చేరేలా తాను ఆదేశాలు జారీ చేయనున్నట్లు మంత్రి దయాకరరావు ప్రకటించారు.
సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా, ఆయన ఆదర్శ పాలనపై వెలువడిన ఈ పుస్తకం భావితరాలకు గొప్ప స్ఫూర్తి పాఠంగా అభివర్ణించారు. ఆరేళ్లలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు, విధానాలను విశ్లేషిస్తూ గౌరీశంకర్ పలు సందర్భాల్లో రాసిన వ్యాసాల సంకలనం ‘ఒక్కగానొక్కడు’ చరిత్రలో నిలిచే పుస్తకమన్నారు.