మేం తలచుకుంటే దుమ్ముదుమ్మైపోతరు అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బీజేపీ నాయకులను హెచ్చరించారు. తెలంగాణను అరిగోస పెట్టిన లఫంగిపార్టీ.. దోపిడీ దొంగల పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రజలు అధికా రం ఇచ్చారని.. ఏ ఢిల్లీవోడో నామినేట్ చేస్తేనో. ఇంకెవడో ఇస్తేనో రాలేదని పేర్కొన్నారు. ఏండ్లు గా తెలంగాణ ఈ దుస్థితికి రావడానికి కారణమైన కాంగ్రెస్‌కు తెలంగాణ పేరు ఉచ్ఛరించే అర్హతే లేదని చెప్పారు. రాష్ర్టానికి అన్యాయం జరుగుతున్నా పదవులు, పైరవీల కోసం నోరు మూసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగర్ డ్యాంను 19 కిలోమీటర్లపైన నిర్మిస్తే నేడు నల్లగొండ జిల్లాలో ఇన్ని లిఫ్ట్‌లు నిర్మించుకోవాల్సిన దుస్థితి ఉండేది కాదని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా హాలియా సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
తెలంగాణ దుస్థితికి కారణమెవరు?
తెలంగాణను నాశనంచేసిందెవరు? నాటి దుస్థితికి కారణమెవరు? ఎవరు చెడగొట్టా రు?ఎవరు కరువు పాల్జేశారు? దీన్ని మొత్తం ఎవరు దెబ్బకొట్టారో ప్రజానీకం అంతా ఆలోచించాలి. అనేక భాషలు, మతాలు, విభిన్న సంస్కృతితో గొప్పగా ఉన్న హైదరాబాద్ రాష్ర్టాన్ని మూడు ముక్కలు చేసిన పాపాత్ములు కాంగ్రెస్‌వాళ్లు కాదా? మూడు ముక్కల్లో ఓ ముక్కను మహారాష్ట్రలో, ఇంకో ముక్క ఆంధ్రాలో, మరో ముక్కను కర్ణాటకలో కలిపిన దుర్మార్గులు వారు. చారిత్రక తప్పిదాలకు కారకులెవరు? రైతులు చచ్చిపోయే దుర్భర పరిస్థితి తెచ్చిందెవరన్నది ఒకసారి ఆలోచించాలి.
రాబందుల కాంగ్రెస్
కాంగ్రెస్ ముఖానికి ఏనాడైనా రైతుబంధు గురించి ఆలోచించారా? రాబందుల్లా వ్యవహరించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా వారికోసం ఏమీ చేయలే. కానీ, నేడు ఏడాదికి రైతులకు రైతుబంధు కింద రూ. 15 వేల కోట్లిస్తున్నాం. ఠంచన్‌గా బ్యాంకులో పడి మూడు మూడు మెసేజ్‌లు వస్తున్నాయా? లేదా? కాంగ్రెస్ హయాంలో ఐదొందలొస్తే అందులో 250 కమిషన్ ఇయ్యాలె. గీకాలె.. గోకాలె.. మనం దరఖాస్తు పెట్టాలె. దండాలు గట్టాలె. అయ్యగారికి.. ఆఫీసర్ గారికి.. ఆఖరికి అటెండర్‌కి కూడా ఇయ్యాలె. సగం మింగేది. ఇయ్యాల ఐదువేలు కేసీఆర్ అక్కడ వేస్తే అవి మీ బ్యాంకులకు నేరుగా జమవుతున్నయా? లేదా? ఇదీ టీఆర్‌ఎస్ గవర్నమెంట్. ఇదీ క్లీన్ గవర్నమెంట్. ఇది అవినీతిరహితమైన గవర్నమెంట్. ఈ పరిపాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నరు అని అన్నారు.