మిషన్ భగీరథ నీటితో ప్రజల ఆరోగ్యానికి భరోసా లభిస్తున్నది. నీటితో వచ్చే రోగాలకు అడ్డుకట్ట పడుతున్నది. అంతర్జాతీయ ప్రమాణాలతో గంట గంటకూ పరీక్షలు చేసి పైసా ఖర్చు లేకుండా ఇంటింటికీ సురక్షిత తాగునీటిని ప్రభుత్వం సరఫరా చేస్తున్నది. తాగునీరు కొనే పనిలేకుండా ఆర్థికంగా చేదోడుగా నిలుస్తున్నది. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలో 23,804 ఆవాసాల్లోని 54 లక్షల ఇండ్లకు నల్లాల ద్వారా భగీరథ నీటిని అందిస్తున్నది. అదేసమయంలో మిషన్ భగీరథ నీటిపై నమ్మకం పెంచేందుకు విస్తృత ప్రచారం చేపడుతున్నది.
సమావేశాల్లో భగీరథ నీరు
మిషన్ భగీరథ పనులు పూర్తికావడంతో అధికారులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మిషన్ భగీరథ నీటి వాడకంపై గ్రామాల్లో ఉన్న అపోహను తొలగిస్తున్నారు. భగీరథ నీరు ఆరోగ్యానికి అన్ని విధాలుగా మంచివని, బీఐఎస్ ప్రకారం ఏ లవణాలు, ఎంత మోతాదులో ఉండాలో తెలియజేస్తూ గ్రామాల్లో వివరిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు భగీరథ నీటిని తాగడం ద్వారా ప్రజల్లో విశ్వాసం కలిగిస్తున్నారు. ప్ర భుత్వ కార్యాలయాల్లో అధికారులు ఈ నీటినే తాగుతున్నారు. మిషన్ భగీరథ ద్వారా అందిస్తున్న నదీ జలాల్లో బీఐఎస్ ప్రకారం 6.8 నుంచి 8.2 పీహెచ్ ఉంటుంది. కానీ ఆర్వో నీటిలో ఖనిజాలు ఉండవు. ఈ నీరు తాగి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు.
మిషన్ భగీరథ నీటి ప్రత్యేకతలు
- మిషన్ భగీరథ నీటిలో తగిన మోతాదులో లవణాల శాతం (టీడీఎస్) ఉండటం వల్ల నీరసం రాదు. అంతర్గత అవయవాలు మెరుగ్గా పనిచేస్తాయి. గుండె రక్తనాళాల వ్యవస్థ సమర్థంగా పనిచేస్తుంది.
- శరీరానికి అవసరమైన పీహెచ్ పెరిగి నీటి ఆమ్ల స్థితి తగ్గి.. క్షార స్థితి పెరిగి శరీర అంతర్భాగంలోని అవయవాలు బాగా పనిచేస్తాయి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.
- నీటిలో తాగడానికి ఉండాల్సిన ఆల్కాలినిటీ (క్షారత్వం) పెరిగి ఆమ్లత్వం తగ్గి శరీర అంతర్గత అవయవాలు సరిగా పనిచేస్తాయి.
- శరీరానికి కావాల్సిన కాల్షియం మోతాదులో ఉండటం వల్ల ఎముకల పెరుగుదల సాఫీగా ఉంటుంది. దృఢంగా మారుతాయి.
- మెగ్నీషియం మోతాదు స్థాయిలో ఉండటం వల్ల శరీరంలోని అన్నిరకాల జీవ రసాయన క్రియలు మెరుగ్గా జరుగుతాయి.
- మిషన్ భగీరథ నీటిలో నైట్రేట్ మోతాదు స్థాయిలో ఉండటం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థలోని నరాల సంకోచ, వ్యాకోచాలు మెరుగ్గా జరుగుతాయి.
- నీటిలో ఫ్లోరైడ్ మోతాదుస్థాయిలో ఉండటంతో వృద్ధులు, మధ్య వయస్కులు, చిన్న పిల్లల్లో ఎముకలు దృఢంగా ఉంటాయి.
- రోగ నిరోధక శక్తి పెరుగుతుంది