పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి భారీ షాక్. బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్ భార్య సుజాత మండల్ ఖాన్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తృణమూల్ పార్టీ ఎంపీ సౌగత రాయ్, అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ సమక్షంలో సుజాత మండల్ తృణమూల్‌లో చేరారు. ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ.. బీజేపీ కోసం కష్టపడి పని చేశాను.. కానీ ఆ పార్టీలో తనకు గౌరవం లేకుండా పోయింది. ఒక మహిళగా ఆ పార్టీలో ఉండలేకపోతున్నాను అని తెలిపారు. అవినీతిపరులకు గాలం వేసి బీజేపీ పార్టీ బలపడేందుకు యత్నిస్తోందన్నారు.
బెంగాల్లో బీజేపీకి సీఎం అభ్యర్థే లేడు అని పేర్కొన్నారు. మమతా బెనర్జీ కోసం పని చేయడం ఒక మహిళగా తనకు గౌరవం ఉంటుందని తాను భావిస్తున్నానని తెలిపారు. ఎంపీ సౌమిత్ర ఖాన్ తృణమూల్‌లో చేరుతారా? అన్న ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ భవిష్యత్‌లో ఏం జరగబోతోందో ఎలా చెప్పగలమని సుజాత పేర్కొన్నారు.