నిరుద్యోగులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ‘డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ’ (డీఈఈటీ) ద్వారా ఇకపై యువతకు వేగంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్రంలోని యువతకు మరింత వేగవంతంగా ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు ఉద్యోగులకు లోన్లు, మార్ట్గేజ్ వేగంగా జరిపే లక్ష్యంతో అమెరికాకు చెందిన ఎక్విఫాక్స్ సంస్థతో డీఈఈటీ శుక్రవారం ఒప్పందం చేసుకున్నది.
దీంతో ఇకపై డీఈఈటీలో నమోదు చేసుకున్న అభ్యర్థుల వెరిఫికేషన్ వేగంగా, పారదర్శకంగా పూర్తవనున్నది. ప్రస్తుతం వెరిఫికేషన్ ప్రక్రియకు 8-10 రోజులు పడుతున్నది. ఇకపై డీఈఈటీలో నమోదుచేసిన వివరాలు సరైనవో కావో వెనువెంటనే నిర్ధారించే అవకాశం ఉంటుంది. తద్వారా కంపెనీలు అర్హులైనవారిని, సమర్థులైనవారిని వేగంగా గుర్తించి, భర్తీ చేసుకొనేందుకు అవకాశం కలుగుతుంది.
అంతేకాకుండా డీఈఈటీలో నమోదైనవారికి ఎక్విఫాక్స్ సంస్థ క్రెడిట్ రిపోర్ట్‌లను అందజేస్తుంది. ఫలితంగా లోన్లు, మార్ట్గేజ్ సమయంలో ఈ నివేదికలు ఎంతో ఉపయోగపడనున్నాయి.
ఐటీ రంగంలో ఉద్యోగావకాశాలకు తెలంగాణ బంగారు గనిలా మారిందని ఈ కార్యక్రమంలో మాట్లాడిన రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రఖ్యాత కంపెనీలు, లక్షల మంది ఉద్యోగులతో రాష్ట్ర ఐటీ రంగం విరాజిల్లుతున్నదని చెప్పారు.
రాష్ట్రంలోని యువతకు ఇతర రంగాల్లోనూ ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని వెల్లడించారు. ప్రఖ్యాత కంపెనీలకు, లక్షల మంది ఉద్యోగులకు రాష్ట్రం వేదికగా మారిందని, ఇదే తెలంగాణకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చి పెడుతున్నదని చెప్పారు. ఈ క్రమంలో ‘డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ’ (డీఈఈటీ) ప్రఖ్యాత క్రెడిట్ రిపోర్టింగ్ ఏజెన్సీ ‘ఎక్విఫాక్స్’తో చేతులు కలుపడం ఒక మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు. అభ్యర్థులకు అర్హత మేరకు ఉద్యోగాలు కల్పించడంతోపాటు కంపెనీలకు సమర్థులైన సిబ్బందిని, లాభాలను అందించేలా ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని వెల్లడించారు.