తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ‘డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ’ను (డీఈఈటీ) అందుబాటులోకి తెచ్చింది. కృత్రిమ మేధతో నడిచే ఈ వేదిక నిరుద్యోగులు, కంపెనీల మధ్య సంధానకర్తగా పనిచేస్తున్నది.
నిరుద్యోగులు తమ విద్యార్హతలు, ఇతర వివరాలతో డీఈఈటీలో నమోదు చేసుకుంటారు. కంపెనీలు ఆయా వివరాలను పరిశీలించి అర్హులను ఎంపిక చేసుకుంటాయి. అలాగే నిరుద్యోగులు, ఉద్యోగులు ఈ వేదిక ద్వారా ఆయా కంపెనీల్లోని ఖాళీల వివరాలను తెలుసుకోవచ్చు.
జాబ్ అలర్ట్స్, ఇంటర్వ్యూ తేదీలు వంటి వివరాలు మెసేజ్‌ల రూపంలో వస్తాయి. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల నుంచి పెద్దపెద్ద కంపెనీల వరకు ఈ సేవలు ఎంతో ఉపయోగపడుతాయని అధికారులు చెప్తున్నారు. డీఈఈటీ ద్వారా ఇప్పటివరకు ప్రైవేట్ రంగంలో రెండు లక్షలకుపైగా ఉద్యోగాలు, సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల్లో 1.25 లక్షల ఉద్యోగాలను కల్పించారు. పలు కంపెనీలు, 10 లక్షలకుపైగా నిరుద్యోగులు ఇందులో రిజిస్టర్ అయ్యారు.