Home / SLIDER / దానికి ఘంటా చక్రపాణి గారే ఉత్తమ ఉదాహరణ

దానికి ఘంటా చక్రపాణి గారే ఉత్తమ ఉదాహరణ

నిబద్ధత గల ఉద్యమకారులు పరిపాలనలో భాగస్వాములు అయితే తెలంగాణ సమాజానికి ఎంత మేలు జరుగుతుందో ఘంటా చక్రపాణి గారే ఉత్తమ ఉదాహరణ. సుధీర్ఘమైన రాష్ట్రసాధన ఉద్యమం విజయతీరాలకు చేరి స్వరాష్ట్రంగా తెలంగాణ అవతరించాక ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ గారు తనతో పాటు ఉద్యమంలో నడచివచ్చిన అనేకమంది ఉద్యమకారులను పాలనలో భాగస్వాములను చేశారు.

డిసెంబర్ 2014లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఏర్పాటు చేసి దానికి తొలి చైర్మన్‌గా ఉద్యమంలో తన గళాన్ని బలంగా వినిపించిన ఘంటా చక్రపాణి గారిని ఎంపికచేశారు.

ఉద్యమం ముగిసి స్వపరిపాలన వచ్చిన మాట నిజం కానీ రాష్ట్రానికి పునాది రాళ్లైన ఘంటా చక్రపాణి లాంటి వాళ్లకు నూతన బాధ్యతల్లో కూడా అనునిత్యం పోరాటమే. ఆ యుద్ధాలు ఆయన తొలి అడుగు వేసిన రోజే మొదలైనయ్.

పేరుకు స్వరాష్ట్రం వచ్చింది అన్నమాటే కానీ అప్పటికి అనేక వ్యవస్థల మీద ఉమ్మడి రాష్ట్రపు పెత్తనాలు ఇంకా పోలేదు. ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ భవనంలోనే ఒక మూలన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టీ్ఎస్‌పీ్ఎస్‌సీ) ఏర్పాటు చేస్తే, ఘంటా చక్రపాణి గారు ఆరోజు కనీసం దానిలోకి పోకుండా ఆ రూములకు తాళం వేసారు వలస పాలన అవశేషాలు. తెలంగాణా ఉద్యోగ సంఘాల మిత్రులు ఆరోజు అక్కడ ధర్నాకు కూర్చుని ఆ రూముల తాళాలు తెరిపించాల్సి వచ్చింది.

అట్లా మొదలైన చక్రపాణి గారి ప్రస్థానం గత ఆరేళ్లూ ఒక పోరాటం నుండి మరో పోరాటానికి సాగింది. తొలిరోజుల్లో ఏపీపీఎస్సీ ఉద్యోగుల విభజన జరిగితే అందులో అధికారుల్లో అత్యధికశాతం ఆంధ్రకు, కింది స్థాయి ఉద్యోగులు తెలంగాణకు మిగిలారు. ఉన్న కొద్దిపాటి స్టాఫ్‌తో తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇస్తున్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి చక్రపాణి గారి నేతృత్వంలో బృందం ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపిందో నేను దగ్గరినుండి చూశాను. ఉమ్మడి రాష్ట్రంలో సర్వరకాల రుగ్మతలున్న పబ్లిక్ సర్వీస్ కమీషన్‌ను సంస్కరణల బాట పట్టించాడాయన. పారదర్శకత పెంచడం కోసం టెక్నాలజీని అందిపుచ్చుకుని డిజిటల్ పబ్లిక్ కమీషన్‌గా తీర్చిదిద్దారు. అనేక ఇతర రాష్ట్రాల నుండే కాదు ఇతర దేశాల నుండి కూడా మన్ననలు అందుకున్నారు.

ఉద్యమ ఆకాంక్షల వల్ల ఉద్యోగాలు భర్తీ చేయడంలో దేశంలో ఏ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమీషన్ మీద లేనంత వత్తిడి తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమీషన్ మీద ఉంది. గత ఆరేళ్లలో వందల నోటిఫికేషన్లు వెలువరించినా, అందులో రెండు మూడు కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందులు పడ్డా, ప్రభుత్వ అధికారుల అలసత్వం వల్ల ఒక్కోసారి నియామక ప్రక్రియ ఆలస్యం అయినా ఆ విమర్శల భారం కూడా తానే మోయాల్సి వచ్చినా, ఎంతో ఓర్పుగా ఒక్కో చిక్కుముడినీ విప్పుకుంటూ తన పని తను చేసుకుపోయారు చక్రపాణి గారు.
దాదాపు ముప్పై అయిదువేల ఉద్యోగ నియామకాలు పూర్తిచేసినా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ మీద ఒక్క మచ్చ కూడా రాలేదంటే దానికి కారణం ఆయన నిబద్ధత.

టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా ఊపిరి సలపనంత పనుల్లో ఉన్నా, కొన్ని పరిమితులు ఉన్నా కూడా ఆయన అనేక సభల్లో, సమావేశాల్లో పాల్గొంటూ తెలంగాణ సమాజంతో తన సంభాషణ కొనసాగించారు.

ఏ రాష్ట్రానికైనా తొలినాళ్లలో జరగాల్సింది Institutional Building – పదికాలాల పాటు ప్రజలకు సేవలందించే ఉత్తమ సంస్థల నిర్మాణం.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్మాణంలో ఘంటా చక్రపాణి గారు ఒక బలమైన పునాది రాయి. ఏ పైరవీ, అవకతవకలు లేకుండా నేరుగా ఇంటికే నియామక పత్రం వచ్చిన ముప్పై అయిదువేల తెలంగాణ బిడ్డల సాక్షిగా అనేక తరాల పాటు వారి పేరు నిలిచిఉంటుంది.

ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్‌గా పదవీ విరమణ చేస్తున్న ఘంటా చక్రపాణి గారికి అభినందనలు. వారిని ఎంపిక చేసిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat