ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా టీకాలు రాష్ర్టానికి జనవరిలో వచ్చే అవకాశం ఉన్నదని వైద్యారోగ్యశాఖ సంచాలకుడు శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఎప్పుడు వచ్చినా కొన్ని గంటల్లోనే పంపిణీని ప్రారంభించి ఒకటి రెండురోజుల్లోనే పూర్తిచేసేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. వ్యాక్సినేషన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 10వేల మంది సిబ్బందిని సిద్ధంగా ఉంచుతామన్నారు.
కరోనా టీకా పంపిణీ ఏర్పాట్లలో భాగంగా జిల్లా వైద్యాధికారులకు (డీఎంహెచ్వో) రెండు రోజుల శిక్షణ సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ మెత్తం 3 కోట్ల డోసులను నిల్వ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.
రాష్ట్రస్థాయి కోల్డ్ స్టోరేజీల్లో 2 కోట్ల డోసులు, రీజినల్ కేంద్రాల్లో మరో కోటి డోసులు నిల్వ చేస్తామని వెల్లడించారు. తొలిదశలో సుమారు 3 లక్షల మంది ఆరోగ్య సిబ్బందికి టీకా వేస్తామని చెప్పారు. ఆ తర్వాత వివిధ దశల్లో ఇతర వర్గాల వారికి టీకా వేస్తామన్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 10వేల మంది వ్యాక్సినేటర్లకు శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. ప్రజలను ఏ విధంగా చైతన్యవంతులను చేయాలి.
ఎవరెవరిని ఇందులో భాగస్వాములను చేయాలన్నదానిపై సూచనలు ఇచ్చారు. టీకా పంపిణీకి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి ఏర్పాట్లు చేయాలి అన్నదానిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
వ్యాక్సినేషన్ సెంటర్లను గుర్తించి, అక్కడ సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. జిల్లాల్లో కరోనా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కొత్త కేసులు తక్కువగా ఉన్న జిల్లాల అధికారులను అభినందించారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యాధి తగ్గుముఖం పట్టిందని, అయినా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రచార సామగ్రిని ఇప్పటికే పంపిణీ చేశామని, వాటి సహాయంతో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో ఆయా జిల్లాల డీఎంహెచ్వోలు, యూనిసెఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు.