కొవిడ్ నేపథ్యంలో పదో తరగతిలో ఇప్పటికే 70 శాతం మేరకే సిలబస్‌ను ఆన్‌లైన్‌లో బోధిస్తున్న పాఠశాలలు మిగిలిన 30 శాతాన్ని యాక్టివిటీ బేస్డ్ కార్యకలాపాలకు కేటాయిస్తున్నాయి. ఇక పరీక్షలను కూడా కుదించి, అవి రాసే సమయాన్ని కూడా తగ్గించాలని విద్యాశాఖ భావిస్తున్నది. ఆన్‌లైన్/డిజిటల్ క్లాసులకు అనుగుణంగానే పదో తరగతి పరీక్షలను 11 నుంచి ఆరుకు తగ్గించే అవకాశాలను విద్యాశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు.
ఇప్పటివరకు ప్రతి సబ్జెక్టుకు రెండు పేపర్లు చొప్పున, సెకండ్ లాంగ్వేజీకిఒక పేపర్ చొప్పున మొత్తం 11 పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో సబ్జెక్టుకు ఒక పేపరు చొప్పున మొత్తం ఆరు పరీక్షలే నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఇక పరీక్షల సమయాన్ని కూడా రెండున్నర గంటలకు బదులుగా గంటన్నర మాత్రమే నిర్వహించే అవకాశాలున్నాయి. అలాగే ప్రశ్నా పత్రంలో కూడా మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎక్కువ ప్రశ్నలు ఇచ్చి, వాటిలో సమాధానాలు రాసేందుకు ఆప్షన్లు కూడా ఎక్కువగా ఇచ్చే యోచనలో విద్యాశాఖ ఉన్నట్టు సమాచారం. ఒకవేళ వ్యాసం రూపంలో సాధ్యం కాకపోతే ఆబ్జెక్టివ్ విధానంలో కూడా పరీక్షలు నిర్వహించే అవకాశాలున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్ విద్యార్థులు ఇరువురినీ దృష్టిలో పెట్టుకొని ఈసారి ప్రశ్నాపత్రం రూపొందించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి వంటి అరుదైన పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి మార్పులు అనివార్యమవుతున్నాయని అధికారులు అంటున్నారు.