కొవిడ్‌ను ఎదుర్కోవడంలో దక్షిణాది రాష్ర్టాలలోకెల్లా తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన పనితీరును కనబరిచిందని ఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ), ఆస్కి (అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా), ఎఫ్‌టీసీసీఐ (ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండ స్ట్రీ) పేర్కొన్నాయి. వైరస్ సోకినవారిని గుర్తించడం, వ్యాధి విస్తరణను నియంత్రించడం, బాధితులకు చికిత్స అందించడంలో దక్షిణాదిలోని ఐదు రాష్ర్టాలకన్నా తెలంగాణ మొదటిస్థానంలో నిలిచిందని ప్రశంసించాయి.
‘తెలంగాణ ప్రభుత్వానికి కొవిడ్ కార్యాచరణ ప్రణాళిక సిఫారసులు-2వ దశ’ పేరిట ఈ మూడు సంస్థలు ఒక సంయుక్త నివేదికను విడుదలచేశాయి. వైరస్ వేగంగా విస్తరించకుండా అరికట్టడంలో తెలంగాణ సఫలమైందని తెలిపాయి. తెలంగాణ ప్రభుత్వం ఎక్కడికక్కడ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తూ, హోం క్వారంటైన్‌ను ప్రోత్సహిస్తూ, రాష్ట్రంలో మరణాల సంఖ్యను కూడా గణనీయం గా తగ్గించగలిగిందని ప్రశంసించాయి. ఆరోగ్య విభాగాల్లో అవసరమైన సిబ్బందిని నియమించ డం, టీఎస్ఎంహెచ్ఐడీసీ ద్వారా వెంటిలేటర్లు, ఆక్సిజన్ బెడ్స్, పీపీఈ కిట్స్ వంటి వైద్య పరికరాలు సమకూర్చుకోవటం మంచి ఫలితాలను ఇచ్చినట్లు పేర్కొన్నాయి.
కొవిడ్ కేర్‌సెంటర్ల ఏర్పాటు, హోం క్వారెంటైన్‌ను ప్రోత్సహించడం, పెద్ద దవాఖాల్లో వైద్య సేవలు, బస్తీ దవాఖానల వేళల పెంపు, 108 అంబులెన్సుల పనితీరు, టెలి మెడిసిన్ కేంద్రాల ఏర్పాటు, వైద్య పరికరాలను సమకూర్చుకోవటం, హోం ఐసోలేషన్ కిట్ల పంపిణీ, అధిక ధరల వసూలుపై ప్రైవేటు దవాఖానలను బ్లాక్ లిస్టులో పెట్టడం వంటి చర్యలు సత్ఫలితాలిచ్చాయని వెల్లడించాయి.