తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరవాసులకు ముఖ్యమైన సూచన. మంగళవారం, బుధవారం అతి భారీగా వర్షాలు పడనున్నాయి. వాతావరణ శాఖ జారీ చేసిన అంచనాల ప్రకారం 72 గంటలపాటు నగరంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ కమిషనర్ డి.ఎస్. లోకేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కొన్ని చోట్ల తొమ్మిది నుంచి 16 సెంటీమీటర్ల వరకూ కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ వర్ష విపత్తును ఎదుర్కొనేందుకు అధికారులు తమ పరిధి లోని అత్యవసర బృందాలను అప్రమత్తంచేసి అందుబాటులో ఉంచాలని జోనల్, డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పాఠశాలలు, కమ్యూనిటీహాళ్లలో అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసి సహాయ కేంద్రాలుగా మార్చాలని కోరారు. సర్కిల్ అధికారులు తమ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు, ముంపు ప్రాంతాలపై ఎప్పటికప్పుడు దృష్టి పెట్టి ప్రజలకు ఏ ఇబ్బందీ రాకుండా చూడాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తగినన్ని మోటర్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
ఇండ్లలోకి నీరు వెళ్లే అవకాశమున్న ప్రాంతాలను సందర్శించి అక్కడివారిని సమీపంలోని సహాయ కేంద్రాలకు తరలించాలని చెప్పారు. అధికారులకు సెలవులు రద్దు చేసి.. అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించామన్నారు. కంట్రోల్ రూమ్ 24 గంటలు పని చేస్తున్నదని అధికారులు నిరంతరం విధుల్లో ఉంటారని తెలిపారు. ప్రధాన కార్యాలయంలోని వివిధ విభాగాల అధిపతులందరికీ రోజుకి ఒకరు చొప్పున రాత్రి విధులు అప్పగించామన్నారు. ఎక్కడైనా సమస్య తలెత్తితే.. జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ నంబర్ 040-21 11 11 11కు గానీ, 100కు గానీ ఫోన్ చేయాలని లేదా మై జీహెచ్ఎంసీ యాప్‌కు సమాచారం అందించాలని సూచించారు.