తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో పండించిన వరి ధాన్యం కొనుగోలుకు 6 వేల కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. సచివాలయం బీఆర్కే భవన్‌లో మంత్రి గంగుల కమలాకర్.. వరిధాన్యం కొనుగోలుపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులు తొందరపడి ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకోకుండా, తాలు, పొళ్లు లేకుండా ఎండబోయిసన ధాన్యాన్ని తెచ్చి మద్దతు ధరకు అమ్ముకోవాలని సూచించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతి ఒక్కరూ కొవిడ్-19 నిబంధనలు పాటించాలని, ఇబ్బందులు కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
గన్ని సంచుల సమస్య ఉత్పన్నం కాకుండా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ సరిపడ గన్ని సంచులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు త్వరగా డబ్బులు అందేటట్లు చూడాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన తగు సిబ్బందిని సర్దుబాటు చేసుకోవాలని అధికారులకు మంత్రి కమలాకర్ సూచించారు.
ఈ సమావేశంలో పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పౌరసరఫరాల శాఖ కమీషనర్ అనిల్ కుమార్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్ధన్ రెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు