తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువైంది. గురువారం 54,098 నమూనాలు పరీక్షించగా.. 2009 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,95,609కు చేరింది.
2,437 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. ఇప్పటివరకూ మొత్తం 1,65,844 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్‌లో 293, కరీంనగర్లో 114, ఖమ్మం 104, మేడ్చల్ 173, నల్గొండ 109, రంగారెడ్డి 171, భద్రాద్రి, సూర్యాపేట జిల్లాల్లో 77, వరంగల్ అర్బన్‌లో 72 కేసులు నమోదయ్యాయి.
వైర్‌సతో కొత్తగా మరో 10 మంది మరణించగా.. ఇప్పటివరకూ చనిపోయిన వారి సంఖ్య 1145కు చేరింది. ఇదిలా ఉండగా, కరోనాతో బాధపడుతున్న గర్భిణికి 108 అంబులెన్స్ సిబ్బంది అత్యవసరంగా ప్రసవం చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన గర్భిణి 11 రోజుల క్రితం కరోనా బారిన పడింది. దీంతో ప్రసవం కోసం హైదరాబాద్ వెళ్లాలని ప్రైవేట్ ఆస్పత్రి సిబ్బంది సూచించారు.
శుక్రవారం ఉదయం హైదరాబాద్ వెళ్లే క్రమంలో ఆమెకు పురిటినొప్పులు రాగా.. 108 అంబులెన్సులోనే పండంటి పాపకు ఆమె జన్మనిచ్చింది. వారిద్దరినీ వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.