రేణూ దేశాయ్.. పరిచయం అక్కరలేని పేరు. పవన్ కల్యాణ్ మాజీ భార్యగా ప్రస్తుతం పిలుస్తున్నప్పటికీ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రస్తుతం రేణూ ప్రయత్నాలు చేస్తోంది. అందుకే వ్యవసాయం పట్ల ఆమె ఆకర్షితురాలై.. రైతుల కష్టాలను తెలుసుకుంటూ.. తన దారి వేరు అనేలా రేణూ దేశాయ్ నడుస్తోంది. అయితే మంచి ప్రాజెక్ట్ వస్తే.. మళ్లీ తప్పకుండా రీ ఎంట్రీ ఇస్తానని అనేక సందర్భాల్లో ఆమె చెబుతూ వచ్చింది. అలాంటి సబ్జెక్ట్ తన వద్దకు రాగానే.. ఓకే చెప్పడమే కాదు తాజాగా ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను కూడా రేణూ తెలియజేసింది. దీంతో దాదాపు 18 సంవత్సరాల తర్వాత మళ్లీ ఆమె కెమెరా ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.
”మళ్లీ కెమెరా ముందుకు వస్తున్నాను. ఓ అందమైన వెబ్ సిరీస్‌లో చేసేందుకు సైన్ చేశానని చెప్పడానికి సంతోషంగానూ, అలాగే ఎగ్జయిటెడ్‌గా ఉన్నాను. అక్టోబర్‌లో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను కొద్ది రోజుల్లో తెలియజేస్తాను. సత్యాన్వేషణలో ఉన్న ఓ బలమైన మహిళకు దయచేసి మీ దీవెనలు, ప్రేమ అందిస్తారని కోరుతున్నాను. ఈ వెబ్ సిరీస్‌కు నిర్మాతలు డిఎస్. రావు, ఎస్. రజినీకాంత్. సాయి కృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి దర్శకుడు ఎమ్.ఆర్. కృష్ణ మామిడాల. సినిమాటోగ్రఫీ దాశరథి శివేంద్ర..” అని రేణూ దేశాయ్ తన ఇన్‌స్టాగ్రమ్ పోస్ట్‌లో పేర్కొంది.