వర్దన్నపేట కోనారెడ్డి పెద్ద చెరువు గండిని పరిశీలించి, అధికారులను ఆదేశించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.అనంతరం “ప్రజలు ఇళ్ళను ఖాళీ చేయాలి. అధికారులు అప్రమత్తంగా ఉండి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.
వరద ఉధృతి తగ్గే వరకు అంతా జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వర్దన్నపేట కోనారెడ్డి పెద్ద చెరువుకు గండి పడిన నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి, స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్ తో కలిసి ఆ చెరువుని సందర్శించారు.
గండి పడిన చోటుని పరిశీలించారు. వెంటనే గండి పూడ్చివేతకు అవసరమైన చర్యలను ప్రారంభించి, పర్యవేక్షించారు. అక్కడే కొద్దిసేపు ఉండి, ఆయా పనులను జరిగేలా చూశారు. అధికారులను అప్రమత్తం చేసి, వెంటనే ఆ చెరువు కింది ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయాలని కోరారు.
ఆ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే వరకు పూర్తి బాధ్యత అధికారులు తీసుకోవాలని ఆదేశించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చెరువుల పట్ల అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు.