తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు బాగున్నాయి అని కేంద్ర ప్రభుత్వ బృందం మరోసారి స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం హోం ఐసోలేషన్ పేషంట్లకు టెలి మెడిసన్ సేవలు, వారి పర్వవేక్షణను చేపట్టడానికి వినూత్న పద్దతిలో హితం ఆప్ ను ప్రవేశ పెట్టినందుకు నీతి ఆయోగ్ సభ్యులు డా. వినోద్ కుమార్ పాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు.
డా.పాల్ , కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి ఆర్తీ ఆహుజా, డా.రవీంద్రన్ తో కూడిన కేంద్ర బృందం ఈ నెల 9, 10 తేదిలలో కోవిడ్ మేనేజ్ మెంట్ కు సంబంధించిన విషయాలపై రాష్ట్ర అధికారులతో చర్చించేందుకు హైదరాబాద్ లో పర్యటించారు.
ఈ సందర్భంగా డా. వి కె. పాల్ మాట్లాడుతూ… హితం ఆప్ వివరాల తో పాటు రాష్ట్రంలో కోవిడ్ మేనేజ్ మెంట్ పై చేపట్టిన మంచి పనులను ఇతర రాష్టాలతో షేర్ చేసుకోవడం జరుగుతుందని అన్నారు.
రాష్ట్రంలో టెస్టింగ్ ను పెంచారని ఇది వైరస్ కంట్రోల్ కు కీలకమని అన్నారు. వైరస్ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేస్తాయని, కోవిడ్ కర్వ ప్లాటనింగ్ కు చేపట్టవలసిన చర్యలపై చర్చించామన్నారు. రాష్ట్రంలో ఆసుపత్రుల సన్నదత స్థాయి , వైరస్ నివారణ చర్యలు , రోగులకు చికిత్స లాంటి అంశాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.