ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ల ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సమాధానమిచ్చారు. ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామని ఈ సందర్భంగా తెలిపారు . ఎస్సీ, ఎస్టీ కమిషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తేల్చిచెప్పారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్లు గతంలో ఒకటిగా ఉండేవి. వేర్వేరుగా కమిషన్లను ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ మేరకు ఎస్సీ, ఎస్టీ కమిషన్లను వేర్వేరుగా ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. అట్రాసిటీ కేసులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నదని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసమే వాకౌట్
కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ సభ్యులపై ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా జానారెడ్డి, కిషన్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ.. నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని తెలిపారు. విపక్ష సభ్యుల వాకౌట్‌పై మంత్రి జగదీశ్‌రెడ్డి స్పందించారు. 2010 నుంచి ఎస్సీ కమిషన్ వేయలేదన్న విషయాన్ని సభ్యుల దృష్టికి తీసుకువస్తున్నానని మంత్రి తెలిపారు. 2010 నుంచి మంత్రి వర్గంలో ఉన్న వారే ఇప్పుడు వాకౌట్ చేయడం దారుణమన్నారు. ఎస్సీ, ఎస్టీల విషయంలో కాంగ్రెస్ సభ్యులు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ కమిషన్లపై కేంద్ర ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తులు చేశామన్నారు. ఇంకా కేంద్రం నుంచి సమాధానం లేదన్నారు. ఏ అనుమతి కోరినా కేంద్రప్రభుత్వం కాలయాపన జరుపుతుందని మండిపడ్డారు మంత్రి. కాంగ్రెస్, బీజేపీ సభ్యులు.. ఎస్సీ, ఎస్టీలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని కోపోద్రిక్తులయ్యారు. కేవలం రాజకీయాల కోరకు, మీడియాల్లో కనబడేందుకు మాత్రమే వారు వాకౌట్ చేశారని మంత్రి పేర్కొన్నారు.