తెలంగాణ పారిశ్రామిక రంగం 2019-20లో ఘనమైన ప్రగతిని సాధించిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. జాతీయ జీఎస్డీపీ (స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి) సగటుతో పోల్చుకుంటే రాష్ట్రం 8.2 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసిందన్నారు. జాతీయ జీడీపీలో తెలంగాణ వాటా 2018-19లో 4.55 శాతం నమోదు కాగా 2019-20లో అది 4.76 శాతానికి పెరిగిందని చెప్పారు. తలసరి ఆదాయంలో జాతీయ సగటు రూ.1,34,432 కాగా తెలంగాణలో 2,28,216 రూపాయలుగా నమోదైందని వివరించారు.
దేశ ఎగుమతుల్లోనూ తెలంగాణ వాటా 10.61 శాతం నుంచి 11.58 శాతానికి పెరిగిందన్నారు. రానున్న రోజుల్లో సుమారు రూ.45,848 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి భారీ ప్రాజెక్టుల రూపంలో రానున్నాయి. తద్వారా సుమారు 83 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. రాష్ట్ర ఔషధ పరిశ్రమల విలువను 100 బిలియన్ డాలర్లకు పెంచడం, 4 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని వివరించారు. హైదరాబాద్ సమీపంలో ఉన్న జీనోమ్ వ్యాలీ వేగంగా విస్తరిస్తోందన్నారు. ఇప్పటికి 200 కంపెనీలతో సుమారు 10 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతుండగా.. కొత్తగా శాండజ్, సింజిన్, టీసీఐ కెమికల్స్, యాపన్ బయో, వల్లర్క్ ఫార్మా తదితర కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయని చెప్పారు.
వైద్యపరికరాల ఉత్పత్తి పార్కులో 25 సంస్థలు పనులు ప్రారంభించాయని తెలిపారు. హైదరాబాద్ ఔషధనగరికి ఇప్పటికే నిమ్జ్ హోదా రాగా త్వరలోనే దాని శంకుస్థాపన పనులు చేపడతామన్నారు. రాష్ట్రంలో సుమారు 18 సూక్ష్మ, చిన్న పరిశ్రమలను పునరుద్ధరించామని పేర్కొన్నారు. ప్రస్తుత కరోనా సంక్షోభంలో రాష్ట్రంలోని పరిశ్రమలు ప్రభుత్వానికి అండగా నిలిచాయని కొనియాడారు. సీఎం సహాయనిధి కోసం సుమారు రూ.150 కోట్లకు పైగా నగదు, పరికరాలను అందించారని చెప్పారు. పరిశ్రమల శాఖ 2019-20 వార్షిక నివేదికను ఆయన తమ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్తో కలిసి మంగళవారం ప్రగతిభవన్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా నివేదికలోని అంశాలపై మంత్రి వివరించారు.