కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తమతమ పరిధుల్లో సేవలు అందిస్తున్నారు. వీటికి తోడుగా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రభుత్వానికి సాయపడుతున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తమ వంతుగా ఏదో ఒకటి చేయాలని తలంచిన ఢిల్లీకి చెందిన తల్లీకుమారుడు.. వారి పరిధిలోని పేదలకు మాస్కులు కుట్టి ఉచితంగా పంచిపెడుతున్నారు. నగరంలోని చిత్తరంజన్ పార్క్ సమీపంలో నివసించే వీరు.. కరోనా కారణంగా పేదలు పడుతున్న అవస్థలను నిత్యం చూస్తున్నారు. కనీసం వారు మాస్కు కూడా కొనుగోలు చేసుకొనే స్థితిలో లేకపోవడం చూసి వీరు చలించిపోయారు.
అందుకు ఇంట్లోనే మాస్కులు కుట్టి ఉచితంగా పంపిణీ చేయాలని తమ పథకాన్ని ప్రారంభించారు. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న సౌరవ్ దాస్ తన 56 ఏండ్ల వయసున్న తల్లి లక్ష్మీదాస్ తో కలిసి మాస్కులు కుట్టడం మొదలెట్టాడు. తల్లి నిత్యం 30-40 మాస్కులు కుడుతుండగా.. వాటిని స్థానిక చిత్తరంజన్ పార్క్ వద్ద డిస్పెన్సర్ ఏర్పాటుచేసి అందులో మాస్కులు అందుబాటులో ఉంచుతున్నాడు.
పిక్ వన్ స్టే సేఫ్ పేరుతో ఏర్పాటుచేసిన డిస్పెన్సర్ వద్ద పేదలు ఉచితంగా మాస్కులు పొందడం పట్ల ఆ తల్లీకొడుకులిద్దరూ సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి అయింది.
అయితే పేదలు, కార్మికులు వాటిని కొనుగోలు చేసే స్థోమత లేకపోవడాన్ని చూసి తామే ఎందుకు మాస్కులు కుట్టి పంపిణీ చేయకూడదని నిర్ణయించుకొన్నామని చెప్తున్నారు లక్ష్మీదాస్. తన ఒంట్లో శక్తి ఉన్నంత వరకు పేదలకు సేవలందించడంతో ఆనందం పొందుతానని అంటున ఈ తల్లీకొడుకులను ఆదర్శంగా తీసుకొని మరికొందరైనా ఇలా మాస్కులు కుట్టి ఉచితంగా పంపిణీ చేస్తే కరోనాను మరింత తొందరగా అరికట్టవచ్చని పెద్దలంటున్నారు.