కొవిడ్ విజృంభణ భారత్‌లో కొనసాగుతూనే ఉంది. ఏ రోజుకారోజూ అత్యధిక కేసులు నమోదవుతూ ఆందోళనకర స్థాయికి చేరుతోంది. గడచిన 24 గంటల్లో 9987 కేసుల నమోదు ఓ రికార్డు కాగా… 331 మంది మృత్యువాత పడ్డారు. దీనితో దేశంలో కరోనా వైరస్ మరణాల సంఖ్య 7,476కు చేరింది. మొత్తం 2,66,598 కేసులతో అంతర్జాతీయంగా ఐదో స్ధానంలో ఉన్న భారత్… ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న కరోనా బాధితుల సంఖ్యలో రెండో స్థానంలో ఉండటం గమనార్హం.
కొవిడ్-19కు సంబంధించి అంతర్జాతీయ గణాంకాల సంస్థ ‘వరల్డోమీటర్’ వివరాల ప్రకారం… విషమంగా ఉన్న కరోనా బాధితుల సంఖ్య పరంగా అమెరికా (16,907) తొలి స్థానంలో ఉండగా… 8,944 కేసులున్న భారత్‌దే ద్వితీయ స్థానం. కరోనా హాట్‌స్పాట్‌గా ఉన్న బ్రెజిల్‌లో కేసులు భారత్‌కంటే మూడురెట్లు అధికమైనప్పటికీ… సీరియస్ కేసులు మన కంటే తక్కువగా ఉన్నాయి. ఇక రష్యాలో సీరియస్ కేసుల సంఖ్య భారత్‌లో నాలుగో వంతుగా ఉంది.
కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయానికి దేశవ్యాప్త కొవిడ్-19 కేసుల సంఖ్య 2,66,598 కాగా.. కరోనా మృతుల సంఖ్య ఐదు శాతం కంటే తక్కువేనని చెప్పింది. ఇక ఐసీయూలో ఉన్న బాధితులు 2.25 శాతం కాగా… 1.91 శాతం మందికి ఆక్సిజన్ సహాయం అందిస్తున్నామని వివరించింది. కరోనా కేసుల్లో అధిక భాగం మహారాష్ట్ర, దిల్లీ, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచే ఉన్నాయని ఆరోగ్యశాఖ వివరించింది.