మహమ్మారి కోరలకు చిక్కిన ప్రపంచం.. వైరస్ బారినుంచి కోలుకునేందుకు ఇంకా అష్టకష్టాలు పడుతోంది. మరోవైపు లాక్డౌన్ నేపథ్యంలో రవాణా వ్యవస్థలు, వాణిజ్య,వ్యాపార కార్యకలాపాలు స్థంభించిపోయాయి. ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి కూరుకుపోతోంది. మరోవైపు లక్షలాది మంది కార్మికులు, ఉద్యోగుల ఉపాధి ప్రశ్నార్థకమంది మారింది. అనేక సంస్థలు ఉద్యోగాలు తొలగింపు బాటలో అన్నాయి.
అయితే ఆన్లైన్ దిగ్గజం అమెజాన్ మాత్రం వేలాదిమందిని ఉద్యోగులుగా నియమించుకుంటోంది. కరోనా సంక్షోభ సమయంలో ఆర్డర్ల డిమాండ్ భారీగా పుంజుకోవడంతో భారీ స్థాయిలో కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. ఇప్పటికే అమెరికా మార్కెట్లో లక్షమందికి పైగా అభ్యర్థులను నియమించుకున్నసంస్థ మరో 75 వేల మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు సోమవారం ఒక బ్లాగ్ పోస్ట్‌లో వెల్లడించింది.
అంతేకాదు అక్కడ పెరుగుతున్న అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని వేతనాల పెంపు కోసం మొత్తం ఖర్చును 500 మిలియన్ డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే భారతదేశంలో మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగింపు, ఏప్రిల్ 20 నుంచి కొన్ని అత్యవసర సేవలకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాల నేపథ్యంలో దేశంలో ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయబోతోందనే దానిపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత లేదు.