నోవెల్ కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. అన్ని దేశాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. సామాజిక దూరాన్ని కొన్ని దేశాలు పాటిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు కూడా ధరించాలని కొన్ని దేశాలంటున్నాయి. వాస్తవానికి ఆసియా దేశాలైన చైనాతో పాటు జపాన్, వియత్నం, మలేషియా, సింగపూర్ లాంటి దేశాల్లో మాస్క్‌లు ఎప్పుడూ ధరిస్తూనే ఉంటారు.
ప్రస్తుతం నోవెల్ కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని సూచనలు చేసింది. ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్‌లు ధరించాల్సిన అవసరం లేదు, ఒకవేళ కరోనా లక్షణాలు ఉన్నవారు కానీ, లేకపోతే కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నవారు కానీ కచ్చితంగా మాస్క్‌లు ధరించాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది.
కరోనా వైరస్ వ్యాప్తిచెందుతున్నా.. యూరోప్‌తో పాటు అమెరికా లాంటి దేశాలు మాస్క్ నియమాన్ని పాటించడం లేదు. దాంతో వైరస్ వ్యాప్తి శరవేగంగా జరుగుతున్నట్లు కూడా అంచనా వేస్తున్నారు. కరోనాను కఠిన నియమాలతో కట్టడి చేసిన చైనా కూడా పశ్చిమదేశాలపై ఇదే ఆరోపణ చేస్తున్నది. యూరోప్‌తో పాటు అమెరికా ప్రజలు కచ్చితంగా మాస్క్‌లు ధరించాలని ఇటీవల డ్రాగన్ దేశం సూచించింది.
కానీ యురోపియన్లు ఆ నియమాన్ని పాటించినట్లు కనిపించడంలేదు. మొదట్లో డబ్ల్యూహెచ్‌వో ఇచ్చిన కొన్ని సలహాలు.. మాస్క్‌ల వినియోగంపై అనుమానాలకు తావుతీశాయి. దీంతో ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నిర్ణయంపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలన్న నియమాన్ని డబ్ల్యూహెచ్‌వో సూచించే అవకాశాలు ఉన్నాయి.