గ్రేటర్ హైదరాబాద్‌లో జనతా కర్ఫ్యూ గ్రాండ్ సక్సెస్ అయింది. జనమంతా కోవిడ్‌ను తరిమి కొట్టేందుకు స్వచ్ఛందంగా మద్దతు పలికారు. రోజంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సరిగ్గా సాయంత్రం ఐదు గంటలకు అందరూ ఇళ్ల ముందరకు వచ్చిచప్పట్లతో వైద్యులకు సంఘీభావం తెలిపారు. ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాలన్న ప్రభుత్వ పిలుపుతో మహానగరం పూర్తిగా స్పందించింది. ఎవరికి వారు స్వీయ నిర్బంధాన్ని అమలు చేయటంతో నగరమంతా బోసిపోయింది. గతమెన్నడూ లేని రీతిలో పూర్తి నిర్మానుష్యమైంది. మెట్రోకు తోడు బస్సులు, ప్రైవేటు వాహనాల బంద్ పాటించారు. అత్యవసర పనుల మీద వెళ్లే వారిని సైతం పోలీస్‌లు పలు చోట్ల నిలిపేసి విచారించారు. అకారణంగా రోడ్లపైకి వచ్చిన వారిని సంజాయిషీ అడగడటంతో పాటు పలు చోట్ల కోవిడ్ వైరస్ వ్యతిరేకంగా పనిచేస్తామని ప్రతిజ్ఞలు చేయించారు. ఆదివారం నాటి జనతా కర్ఫ్యూలో సుమారు కోటి మంది స్వచ్ఛందంగా పాల్గొన్నారని అధికారులు అంచనాకు వచ్చారు.
ఆదివారం రోజంతా వైద్య సిబ్బంది ఆస్పత్రుల్లో, పోలీస్‌లు రహదారులపై విధులు నిర్వహించారు. కోవిడ్‌పై యుద్ధానికి తామంతా సమైక్యంగా ఉన్నామన్న సంకేతంతో పాటు వ్యాధి నియంత్రణలో నిర్విరామంగా పనిచేస్తున్న శ్రేణులను అభినందిస్తూ ఆదివారం సాయంత్రం మహానగరం చప్పట్లతో అభినందించింది. ప్రజాప్రతినిధులు తమ నివాసాల్లో చప్పట్ల కార్యక్రమంలో పాల్గొనగా కాలనీ, అపార్ట్మెంట్లు, బస్తీలు ఎవరికీ వారు సాయంత్రం ఐదు గంటలకు చప్పట్లుమోగించారు.
కోవిడ్ నివారణ కోసం ఆదివారం నిర్వహించిన జనతా కర్ఫ్యూ..72 ఏళ్ల నాటి పరిస్థితిని తలపించిందని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. 1948 సెప్టెంబర్ 15,16,17 తేదీల్లో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో చేరిన సందర్భంలో చూసిన నిర్మానుష్యం మళ్లీ ఆదివారం సాక్షాత్కరించిందని పలువురు పేర్కొన్నారు. అప్పట్లో మిలటరీ భయంతో ఎవరూ బయటకు వెళ్లకపోగా, ఇప్పుడు ఎవరికి వారు స్వీయ నియంత్రణ వల్లేనని ఇంటాక్ కన్వీనర్ అనురాధారెడ్డిపేర్కొన్నారు.