స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా వైరస్ పేరుతో వాయిదా వేయించామని శునకానందంతో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ నేతలు వరుస షాక్‌లు ఇస్తున్నారు. చంద్రబాబు నీచ రాజకీయాలు భరించ లేక టీడీపీ సీనియర్ నేతలంతా ఒక్కొక్కరిగా వైసీపీలో చేరుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కూతురు శింగనమల మాజీ ఎమ్మెల్యే యామినీబాల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి సీఎం జగన్ స్వయంగా కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వీరిద్దరి చేరికలో వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో గట్టి పట్టున్న వీరిద్దరూ తమ అనుచరులతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.
దళితవర్గానికి చెందిన సీనియర్ నేత శమంతకమణి జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ నుంచి ఓసారి శింగనమల ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత టీడీపీలో ముఖ్యనేతగా ఉన్నారు. ఇక శమంతకమణి కూతురు యామినిబాల 2014లో వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతిని ఓడించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత బాబు సర్కార్‌లో యామినిబాల విప్‌గా కూడా పని చేశారు. అయితే 2019లో మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, జిల్లా నేతల సలహాతో శింగనమల నియోజకవర్గ అభ్యర్థిని చంద్రబాబు మార్చేశారు. అప్పటిదాకా ఎమ్మెల్యేగా ఉన్న యామిని బాలకు బదులుగా కొత్తగా వచ్చిన బండారు శ్రావణికి అవకాశం కల్పించారు. తన కుమార్తెకు టికెట్ కోసం చివరి వరకు శమంతకమణి ప్రయత్నాలు చేశారు. నేరుగా చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేశారు. పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేసినా కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇచ్చి పార్టీనే నమ్ముకున్న వారిని దూరం చేశారంటూ శమంతకమణి అప్పట్లో బహిరంగంగానే వాపోయినా ప్రయోజనం లేకపోయింది.
అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే యామినిబాలకు బదులుగా పోటీ చేసిన బండారు శ్రావణి కూడా వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి చేతిలో ఓడిపోవడం గమనార్హం. అప్పటి నుంచి ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కూతురు యామిని బాల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు తన సామాజికవర్గానికి పెద్ద పీట వేస్తూ.. దళితులను పక్కన పెడుతున్నారనే మనస్తాపంతో తల్లీ కూతుళ్లు టీడీపీని వీడి వైసీపీలో చేరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు అమరావతికి జై కొడుతూ రాయలసీమలో హైకోర్టు ఏర్పాటును కించపర్చేలా వ్యాఖ్యలు చేయడంపై శమంతకమణి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అందుకే శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లుపై చంద్రబాబు విప్ జారీ చేసినా ఓటింగ్‌కు హాజరు కాలేదు. మొత్తంగా టీడీపీ సీనియర్ నేత అయిన శమంతకమణి, తన కూతురు మాజీ ఎమ్మెల్యే యామిని బాలతో కలిసి వైసీపీలో చేరడం అనంతపురం జిల్లాలో టీడీపీకి గట్టి షాక్ ఇచ్చినట్లయింది. త్వరలో అనంతపురం జిల్లాలో కూడా వలసలు షురూ అవడం, టీడీపీ ఖాళీ కావడం ఖాయంగా కనిపిస్తోంది.