ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైనట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. శాసనసభలో కరోనా వైరస్‌పై సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. ఈ వైరస్ కట్టడికి ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కరోనాపై భయం, ఆందోళన వద్దు. దీన్ని కట్టడి చేసేందుకు అవసరమైతే రూ. 5 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు సీఎం.
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజలకు సరిపడా మాస్కులు, శానిటైజర్లు, సూట్లు సిద్ధం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దేశంలో ఇప్పటి వరకు 65 మందికి కరోనా వైరస్ సోకగా ఇందులో 17 మంది విదేశీయులు ఉన్నారని సీఎం తెలిపారు.
65 మందిలో 10 మందిని డిశ్చార్జి చేశారని పేర్కొన్నారు. ఈ వైరస్ వల్ల కేవలం ఇద్దరు మాత్రమే చనిపోయారని కేసీఆర్ పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రిలో చేరిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కూడా కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారని తెలిపారు. మరో ఇద్దరికి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నాయి. వారి నమూనాలను పుణె ల్యాబ్‌కు పంపామని కేసీఆర్ చెప్పారు.