ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా అమరావతి గ్రామాల రైతులు దాదాపు 3 నెలలుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. తొలుత జోలె పట్టి అడుక్కుని మరీ ఈ ఆందోళన కార్యక్రమాలను దగ్గరుండి నడిపించిన చంద్రబాబు శాసనమండలి రద్దు తర్వాత అమరావతి కాడి వదిలేశాడు. అయితే ఇప్పటికీ అమరావతి రైతుల నిరసన కార్యక్రమాలకు స్పాన్సర్ బాబే అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎంతగా అరిచిగీపెట్టినా అమరావతి ఆందోళనలు రాష్ట్రస్థాయి ఉద్యమంగా మల్చలేకపోయాడు చంద్రబాబు. దీంతో క్రమంగా అమరావతి రైతుల ఆందోళనల తీవ్రత తగ్గుతూ వస్తుంది. కాగా గత మూడు నెలలుగా జరుగుతున్న ఆందోళనల్లో ప్రధానంగా చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన రైతులే పాల్గొంటున్నారన్నది బహిరంగ రహస్యం. ముఖ్యంగా వెలగపూడి, తుళ్లూరు, పెదపరిమి, మందడం, తాడికొండ వంటి ఐదారు గ్రామాలకే ఆందోళనలు పరిమితం అయ్యాయి. ఇక అమరావతి రైతుల నిరసన కార్యక్రమాల్లో మందడం రైతులదే కీలక పాత్ర. నిత్యం పోలీసులతో గొడవలు పడడం, మహిళా పోలీసులను విధులను నిర్వహించకుండా వారిని వేధించడం వంటి ఘటనలు మందడం గ్రామంలోనే జరిగాయి.
అయితే అమరావతి గ్రామాల్లో ఒక్క చంద్రబాబు సామాజికవర్గమే మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు కాని..మిగిలిన వర్గాల ప్రజలు ముఖ్యంగా దళిత రైతులు వికేంద్రీకరణకు జై కొడుతున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో ల్యాండ్ పూలింగ్ను అమరావతి గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన ప్రజలు, రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడు జగన్ సర్కార్‌లో తమ భూములు తమకు వెనక్కి వస్తాయని బహుజనులు ఆశిస్తున్నారు. అంతే కాదు అమరావతి రైతులు ఇచ్చిన భూముల్లో దాదాపు 1200 ఎకరాలను జగన్ సర్కార్ పేదల ఇండ్ల స్థలాలకు కేటాయిచింది. దీనిపై హైకోర్టులో కేసుల్లో వేసిన బాబు సామాజికవర్గ రైతులపై, టీడీపీ నేతలపై మిగిలిన సామాజికవర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా అభివృద్ధి వికేంద్రీకరణకు అమరావతి గ్రామాల్లోని బహుజన పరిరక్షణ సమితి మద్దతు తెలిపింది. ఈమేరకు బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో దళిత, మహిళా, ప్రజాసంఘాలు మందడంలో రిలే నిరాహార చేపట్టారు. అభివృద్ధి వికంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని బహుజన పరిరక్షణ సమితి నాయకులు పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు మేలు చేయాలని సీఎం వైఎస్ జగన్ యత్నిస్తున్నారని వారు తెలిపారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని, రైతుల ముసుగులో టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బినామీల కోసమే చంద్రబాబు ఆరాటపడుతున్నారని ఎద్దేవా చేశారు. అసలు అభివృద్ధి వికేంద్రీకరణతో చంద్రబాబుకు వచ్చిన ముప్పేంటని సూటిగా ప్రశ్నించారు. పేదలంటే చంద్రబాబుకు పడడని…కేవలం తన సామాజికవర్గం కోసమే మందడంతో సహా రాజధాని గ్రామాల్లో అమరావతి పేరుతో కృత్రిమ ఉద్యమాన్ని నడిపిస్తున్నాడని బహుజన పరిరక్షణ సమితి నేతలు ఆరోపించారు. ఇకనైనా చంద్రబాబు తన కులం పేరుతో వేస్తున్న పిచ్చి వేషాలు మానకపోతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మొత్తంగా గత మూడు నెలలుగా అమరావతి ఆందోళనల్లో కీలక పాత్ర పోషిస్తున్న మందడం ప్రజలు మూడు రాజధానులకు జై కొట్టడం చంద్రబాబుకు, ఆయన సామాజికవర్గానికి షాకింగ్‌గా మారింది.