రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా, వాస్తవిక దృక్పథం- నిర్మాణాత్మకమైన ఆలోచనల మేలుకలయికగా బడ్జెట్ రూపకల్పన జరిగిందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ సంక్షేమం, వ్యవసాయం, విద్య, వైద్య, విద్యుత్, మౌలిక రంగాలకు బడ్జెట్ లో పెద్దపీట వేశారని తెలిపారు. పేద ప్రజల, రైతుల సంక్షేమానికి, వ్యవసాయ రంగానికి, స్థానిక సం స్థలైన పల్లెలు, పట్టణాల అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ భారీ మొత్తంలో నిధులను కేటాయించారని పేర్కొన్నారు. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పాలన ప్రజలు మెచ్చేదిగా ఉందని, ఏ ప్రభుత్వం తీసుకోనంతగా అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మన రాష్ట్రంలోఅధిక శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం,అనుబంధ రంగాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అవకాశాలు మెండుగా ఉండే వ్యవసాయం రంగం అభివృద్ధికి శ్రద్ధ చూపుతూ ప్రపంచానికి పటెడ్డన్నం పెట్టే రైతుల శ్రేయస్సు కోసం తెలంగాణ ప్రభుత్వం దృఢసంకల్పంతో ముందుకు సాగాలన్నదే సీయం కేసీఆర్ అభిమతం అని చెప్పారు. దానికి అనుగుణంగా రైతు సంక్షేమం, వ్యవసాయం రంగానికి కేటాయింపులు జరిపారన్నారు.
తాను నిర్వహిస్తోన్న అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖలకు బడ్జెట్ కేటాయింపులు చేసినందుకు అసెంబ్లీలో సీయం కేసీఆర్ ను కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అటవీ, పర్యావరణ శాఖకు ఈ బడ్జెట్ లో రూ.791 కోట్లు దేవాలయాల అభివృద్దికి రూ. 500 కోట్లు కేటాయించారని వెల్లడించారు. అర్చకులు, ఆలయ ఉద్యోగుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాలు, వాటి నిర్వహణ కోసం ఈ బడ్జెట్ లో రూ.50 కోట్లు కేటాయించారని చెప్పారు.