తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీమ్ ను నెటిజన్లు తెగ పొగుడుతున్నారు. జిల్లా కలెక్టర్ హోదాలో ఉండి మహమద్ చేసిన పనికి అంతా జేజేలు పలుకుతున్నారు. ఫించన్ రాకపోవడంతో ఇబ్బంది పడుతున్న ఒక వృద్ధురాలికి అండగా నిలవడంతో కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీమ్ పై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జిల్లాలోని గుర్రంపేట గ్రామానికి చెందిన అజ్మీరా మంగమ్మ(70)ఫించన్ కోసం నిన్న బుధవారం కలెక్టర్ కార్యాలయానికి వచ్చింది.
నిల్చునే ఓపిక లేక అక్కడే ఉన్న మెట్లపై కూర్చుంది మంగమ్మ. అటుగా వచ్చిన కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీమ్ ఆమెను గమనించాడు. వెళ్లి ఆ వృద్ధురాలి పక్కనే కింద కూర్చున్నారు. కూర్చుని అవ్వ నీ సమస్య ఏంటని ఎంతో ఆత్మీయతతో కూడిన పలకరింపులతో అవ్వ సమస్యపై అరా తీశారు.తనకు ఫించన్ రావడం లేదు.
ఎలా అయిన సరే మీరే సమస్యకు పరిష్కారం చూపించాలని వేడుకుంది.వెంటనే మహ్మద్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారితో మాట్లాడి ఆ అవ్వకు ఫించన్ మంజూరు చేయించేలా చేశారు. దీంతో మంగమ్మ కలెక్టర్ మహ్మద్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ.. తన సమస్యకు ఎవర్ని కలవలో తెలియక మెట్లపై కూర్చుని ఉన్న ఆ అవ్వను చేరదీసి సమస్యకు పరిష్కారం చూపిన కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీమ్ పై అక్కడున్నవారంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.