తెలంగాణ రాష్ట్ర స్థాయి మున్సిపల్ సదస్సు నిన్న మంగళవారం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రగతి భవన్లో జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు మంత్రులు,ఎమ్మెల్యేలు,మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్లు,కార్పోరేటర్లు,కౌన్సిలర్లు,సంబంధిత అధికారులు పాల్గోన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ”తెలంగాణ పట్టణాలు , నగరాలను దేశంలో కెల్లా ఆదర్శ పట్టణాలుగా మార్చే గురుతర బాధ్యత మేయర్లు , చైర్మన్లు , కౌన్సిలర్లు , కార్పొరేటర్లదే.దేశంలో ఒకప్పుడు రాజకీయాలంటే కష్టం , త్యాగం , ఆత్మార్పణ ఇప్పుడు స్వతంత్ర భారతంలో సౌకర్యవంతంగా మారినయి.
ఐదు కోట్ల మందిలో 140 మందికే మేయర్లు, చైర్ పర్సన్లు అయ్యే అవకాశం వచ్చింది. దీన్ని ఒక ముందడుగు స్వీకరించి, సానుకూలంగా మార్చుకోగలిగితే ప్రజా జీవితంలో ఎంత ముందుకైనా పోవచ్చు. అది మీ చేతుల్లోనే ఉంది. విధి నిర్వహణలో విఫలం కావద్దు. పదవి అసిధారావ్రతం (కత్తిమీద సాము) లాంటిది.ప్రజా జీవితం అంత సులభం కాదు. సోయి తప్పి పని చేయవద్దు. చాలా కష్టపడి రాష్ట్రం తెచ్చుకున్నాం. మన రాష్ట్రం వస్తే మనం బాగుపడతామని ప్రబలంగా పోరాడాం. ప్రజలు నన్ను రెండు సార్లు సిఎం చేశారు. నా వరకైతే గెలిచేంత వరకే రాజకీయం, తర్వాత కాదుఏ పని చేయాలన్నా తదేక దీక్షతో చేయాలి. చాలా మందికి ఆత్మవిశ్వాసం తక్కువ ఉంటుంది. అలా ఉండకూడదు.
అవగాహనతో అర్థం చేసుకుని, చేయాలని అనుకుంటేనే బాధ్యత తీసుకోవాలి. పట్టుదల ఉంటేనే విజయం సాధిస్తారు. మీ మీద ప్రజలకు నమ్మకం కలగాలి. అలా ఒక్కసారి నాయకుడి మీద విశ్వాసం కలిగితే, ప్రజలు సంపూర్ణంగా సహకరిస్తారు.ప్రజాప్రతినిధులు డంబాచారాలు పలకవద్దు. అన్ని పనులు ఓవర్ నైట్ లో చేసేస్తాం అని మాట్లాడవద్దు. ఏం చేయాలనే విషయంలో పక్కా ప్లానింగ్ వేసుకోవాలి. మంచి అవగాహన ఏర్పరచుకోవాలి. సమగ్ర కార్యాచరణను రచించుకుని రంగంలోకి దిగాలి. అందరినీ కలుపుకుని పోయి, ప్రజల భాగస్వామ్యంతో అనుకున్న విధంగా పట్టణాలను తీర్చిదిద్దాలి. ఫోటోలకు ఫోజులివ్వడం తగ్గించి, పనులు చేయించడంపై ఎక్కువ దృష్టి పెట్టాలి అని హితబోధ చేశారు.