పేదలు చికిత్స కోసం పెద్ద నగరాలకు రావాల్సిన అవసరం లేకుండా, వ్యాధి గురించి తెలీగానే వారికి చికిత్స ప్రారంభించేలా ప్రభుత్వం తరఫున ఈ నిబంధనలు రూపొందించారు అని డాక్టర్ నరేష్ ఎం రాజన్ చెప్పారు.
దీనికోసమే నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ ఏర్పాటు చేశారు. ఈ గ్రిడ్‌లో 170 క్యాన్సర్ ఆస్పత్రులు ఉన్నాయి. ఈ ఆస్పత్రుల్లో డాక్టర్లు ప్రత్యేకంగా భారత్‌లోని క్యాన్సర్ రోగుల కోసం మార్గదర్శకాలు రూపొందించారు.
అందులో, రోగులు భారత్‌లో ఏ మూల ఉన్నా, వారికి ఎలాంటి క్యాన్సర్ ఉన్నా, మీరు ఈ టెస్ట్ చేయించుకోవాలి, ఇలాంటి చికిత్స తీసుకోవాలి అనేవి వివరంగా చెప్పారు. వీటితోపాటు గత మూడు నాలుగు ఏళ్లలో క్యాన్సర్ రెస్పాన్స్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. అందులో రోగి, డాక్టర్ ఎక్కడ ఉన్నా వారికి క్యాన్సర్ గురించి మొత్తం సమాచారం ఇచ్చి చికిత్స జరిగేలా చేస్తారు. వారికి నగరాలలో ఉన్న పెద్ద ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం రాదు. ఈ గ్రిడ్‌లో ఆయుష్మాన్ యోజనను కూడా జోడించారు. అంటే, ఏ రోగులు చికిత్స కోసం వస్తారో, వారికి ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం కూడా అందుతుంది.
“ఆయుష్మాన్ యోజన ద్వారా క్యాన్సర్ రోగులకు లబ్ధి చేకూరుతుంది. అంతకు ముందు క్యాన్సర్ మందుల ఖరీదు చాలా ఎక్కువని కూడా చర్చ జరిగింది. దాంతో, ప్రభుత్వ నేషనల్ ఫార్మసూటికల్ ప్రైసింగ్ అథారిటీ క్యాన్సర్ రోగులకు ట్రేడ్ మార్జిన్‌ను 30 శాతం వరకూ పరిమితం చేసింది” అని డాక్టర్ ఎస్వీఎస్ దేవ్ కూడా చెప్పారు.