ఏపీ శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును నిబంధనలకు వ్యతిరేకంగా అడ్డుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. మూడు రాజధానులకు అనుకూలంగా వైసీపీ ఆధ్వర్యంలో ప్రజలు, వివిధ ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తూ చంద్రబాబు దిష్టి బొమ్మలను తగలబెడుతూ తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఇక విశాఖపై చంద్రబాబు చేయిస్తున్న విషప్రచారంపై ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు మండిపడుతున్నారు. అలాగే హైకోర్టుతో రాయలసీమకు ఏం ఒరుగుతుంది…రెండు జీరాక్స్ మిషన్లు, నాలుగు టీ కొట్లు తప్పా అంటూ ఎద్దేవా చేస్తున్న టీడీపీ నేతలపై సీమ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తే సీమ నుంచి రౌడీలు, గూండాలు దిగి..అరాచకం చేస్తారని చంద్రబాబు ఆయన అనుకుల మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై సీమ ప్రజలు రగలిపోతున్నారు.కాగా శాసనమండలి రద్దు నేపథ‌్యంలో చంద్రబాబు అమరావతి రైతుల ఆందోళనల్లో కూడా పాల్గొనడం లేదు.అమరావతి పరిరక్షణ సమితి పేరుతో రాష్ట్రమంతా తిరుగుతానని చెప్పిన చంద్రబాబు రాయలసీమ, ఉత్తరాంధ్రలో అడుగుపెట్టడం లేదు. ఇదే విషయంపై చంద్రబాబును వైసీపీ నేతలు చెడుగుడు ఆడుతున్నారు.
తాజాగా పెడన నియోజకర్గంలో అధికార వికేంద్రీకరణ బిల్లుకు మద్దతుగా ఎమ్మెల్యే జోగి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ… అమరావతిలో లక్షల కోట్ల పెట్టుబడి పెట్టాలంటే సాధ్యం కాదని, భావితరాల కోసం రాష్ట్ర అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని సూచించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలనే సీఎం జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు అయిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడని జోగి రమేష్ మండిపడ్డారు. తన బినామీ భూములు కాపాడుకునేందుకు జోలె పట్టుకుని రాజకీయ బిచ్చగాడిగా మారాడని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కనుక చంద్రబాబు ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలోకి వెళితే మహిళలు చీపుళ్ళతో కొడతారని విమర్శించారు. చంద్రబాబు 16 నియోజకవర్గాలకు, 29 గ్రామాలకే నాయకుడిగా పరిమిమయ్యారని, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కనుమరుగు కావటం ఖాయమని జోగి రమేష్ జోస్యం చెప్పారు. మొత్తంగా వికేంద్రీకరణ బిల్లును అడ్డుకున్న చంద్రబాబుపై ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలతో పాటు వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.