ఏపీ అసెంబ్లీలో శాసనమండలి రద్దు తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా మంత్రి పేర్ని నాని చంద్రబాబు, లోకేష్‌ల తీరుపై మండిపడ్డారు. రామాయణంలో యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకున్నట్టుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలను చంద్రబాబు, లోకేష్‌లు అడ్డుకుంటున్నారని పేర్ని నాని ఫైర్ అయ్యారు. చారిత్రక బిల్లులను అడ్డుకుని టీడీపీ శునకానందం పొందుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు..ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమాన్ని అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇచ్చిన మాట మీద నిలబడటం ఆయనకు అలవాటు లేదని..యూటర్న్లు తీసుకోవడమే ఆయన అలవాటని.. ఎద్దేవా చేశారు.
రాష్ట్రాన్ని విడగొట్టాలని లేఖ ఇస్తారు.. రాష్ట్రాన్ని ఎలా విడగొడతారని ప్రశ్నిస్తారు.. బీజేపీ మతతత్వ పార్టీ అంటారు.. అదే బీజేపీతో పొత్తు అంటారు’ అంటూ చంద్రబాబు తీరును నాని తీవ్రంగా దుయ్యబట్టారు. రాష్ట్రానికి హోదా అవసరమని చెప్పి ప్యాకేజీని స్వాగతించారని.. ప్రతి నిర్ణయంలోనూ చంద్రబాబు యూటర్న్ తీసుకుంటారని విమర్శించారు. ఎన్నికల ముందు మోదీ, అమిత్‌షాను చంద్రబాబు తిట్టారని..ఇప్పుడు వాళ్లిద్దరు మా వెనుక ఉన్నారని చెబుతున్నారని విమర్శించారు. రాయలసీమకు నీళ్లిచ్చామంటున్న చంద్రబాబుకు గత ఎన్నికల్లో కేవలం 3 సీట్లు మాత్రమే వచ్చాయని వెటకారం చేశారు. అదే చంద్రబాబు హయాంలో నిర్లక్ష్యానికి గురైన కొల్లేరు పరిరక్షణ కోసం రూ.350 కోట్లతో రెగ్యులేటర్ల ఏర్పాటుకు సీఎం జగన్ హామీ ఇచ్చారని పేర్ని నాని పేర్కొన్నారు. మొత్తంగా అసెంబ్లీ వేదికగా మంత్రి పేర్ని నాని చంద్రబాబు, లోకేష్‌ల తీరును తీవ్ర స్థాయిలో ఎండగట్టారు.