అమెరికా లెజండరీ బాస్కెట్బాల్ ప్లేయర్, కోచ్ కోబ్ బ్రియాంట్ ఓ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో బ్రియాంట్ కుమార్తె గియానాతో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. ఆదివారం తన ప్రయివేట్ హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న బ్రియాంట్ లాస్ఏంజిల్స్కు 65 కిలోమీటర్ల దూరంలోని క్యాలబసస్లో ఒక్కసారిగా కుప్పకూలింది. హెలికాప్టర్ కూలుతూనే మంటల్లో చిక్కుకోవడంతో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలియాయి. ఇక ఈ ప్రమాదానికి గల కారణాల కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బ్రియాంట్ అకాల మరణంపై అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాలు విచారం వ్యక్తం చేశారు. అమెరికా ఓ దిగ్గజ ఆటగాడిని కోల్పోయిందని, అతడు దేశంలో బాస్కెట్బాల్ అభివృద్దికి విశేషకృషి చేశాడని ప్రశంసించారు. అంతేకాకుండా అమెరికా క్రీడా చరిత్రలో అత్యంత విషాదకరమైన ఘటనగా పేర్కొన్నారు. వీరితో పాటు అమెరికన్ బాస్కెట్బాల్ అసోసియేషన్(ఎన్బీఏ) సంతాపం తెలుపుతూ అతడి మరణం ఎన్బీఏకు తీరని లోటని తెలిపింది.
”కోబ్ మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా. కోర్టులో ఈ మాంత్రికుడు చేసే విన్యాసాలు చూసి మైమరిచిపోయేవాడిని. జీవితం ఊహించలేనిది. అతడి కుమార్తె కూడా ప్రమాదంలో మరణించిందని తెలిసిన తర్వాత నా హ అదయం ముక్కలైంది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. అతడి కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నా” విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు.
”నా ఫేవరేట్ కోబ్ బ్రయింట్, అతడి కుమార్తె మరణ వార్త తెలిసి షాక్కు గురయ్యాను. ఇది ఎంతో బాధాకరం. 5 సార్లు ఎన్బీఏ ఛాంపియన్, 2 సార్లు ఎన్బీఏ ఫైనల్స్ అత్యుత్తమ ఆటగాడు, 4 సార్లు ఆల్స్టార్ అత్యుత్తమ ఆటగాడు, 2 సార్లు ఎన్బీఏ స్కోరింగ్ ఛాంపియన్.. కోబ్ ఆత్మకు శాంతి చేకూరాలని కన్నీటితో ప్రార్థిస్తున్నా అంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు.