ఏపీ శాసనమండలి రద్దుకు రంగం సిద్ధమవుతున్న వేళ…వైయస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా టీడీపీ అధినేత, చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌లపై పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. తాజాగా అసెంబ్లీ మీడియాపాయింట్ వద్ద రోజా మాట్లాడుతూ… ప్రజా తీర్పును అపహాస్యం చేసే విధంగా పెద్దల సభ ఉండడం బాధాకరమని అన్నారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు పైన గ్యాలరీలో కూర్చుని కింద ఉన్న స్పీకర్ షరీఫ్‌తో నిబంధనలకు వ్యతిరేకంగా మాట్లాడించడం దారుణమని అన్నారు. వ్యవస్థలను భ్రష్టుపట్టించడంలో చంద్రబాబు డ్రైవర్ అయితే దానికి స్టీరింగ్ యనమల అని ఫైర్ అయ్యారు. గతంలో ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి మైకు ఇవ్వకుండా.. ఆయన్ని అవమానించి అసెంబ్లీ నుంచి తరిమేసే దగ్గర నుంచి.. మూడు రాజధానుల బిల్లును నిబంధనలకు వ్యతిరేకంగా సెలెక్ట్ కమిటీ పంపించేవరకు చూస్తుంటే…చంద్రబాబు తన వ్యక్తిగత లబ్ది కోసం ఎంతకైనా దిగజారుతాడని అర్థమవుతుందని రోజా అన్నారు. పెద్దల సభను వైయస్ రాజశేఖర్ రెడ్డి పునరుద్ధరిస్తే..చంద్రబాబు తన రాజకీయం కోసం మండలిని వాడుకుంటున్నారని రోజా ఆరోపించారు.
అమరావతిలో తన భూములు, తన బినామీల భూములను కాపాడుకోవడం కోసమే చంద్రబాబు పోరాడుతున్నారని రోజా విమర్శించారు. ఇక చంద్రబాబు తనయుడు లోకేష్ తీరు చాలా విచిత్రంగా ఉంది…శాసన మండలిని రద్దు చేస్తారా..దమ్ముంటే చేయండి అంటున్నాడు..బాగా బలిసిన కోడి…చికెన్షాపు ముందుకు వెళితే ఏమవుతుంది..కోసి ఉప్పు, కారం పూసి కూర వండేస్తారు..ఆ విషయాన్ని లోకేష్ తెలుసుకుంటే మంచిది అని ఎద్దేవా చేశారు..ఇక యనమల రామకృష్ణుడు మహామేధావిలా..ఫీలవుతున్నాడు..ఆయన్ని, ఆయన తమ్ముడిని ప్రజలు రెండు, మూడుసార్లు ఓడించారు. ప్రజలు ఓడించిన ఈయన ప్రపంచ మేధావిలా శాసనమండలిలో ప్రవర్తిస్తున్నాడని రోజా ఫైర్ అయ్యారు. శాసనమండలి వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న చంద్రబాబు, లోకేష్, యనమల లాంటి వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని మండిపడ్డారు.
తమ పార్టీ ఎమ్మెల్సీలతో జగన్ మోహన్ రెడ్డి బేరసారాలు చేస్తున్నారంటూ టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి ఏమన్నా చంద్రబాబు నాయుడా… సిగ్గులేకుండా తెలంగాణలో ఎమ్మెల్సీని కొంటూ.. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నుంచి దొంగలా.. పారిపోయి వచ్చాడని చంద్రబాబుకు చురకలు అంటించారు. పచ్చ కామెర్లవాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు..తాను వెధవ అయితే అందరూ వెధవలే అనుకునే పరిస్థితికి చంద్రబాబు వచ్చారని రోజా ధ్వజమెత్తారు. పెద్దల సభ అంటే పెద్దలను పంపించాలి కాని…తన ఇంట్లో ఉన్న దద్దమ్మను, దద్దోజనాన్ని పంపించి చంద్రబాబు శాసనమండలి పరువు తీస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలు చిత్తుగా ఓడించినా చంద్రబాబుకు ఇంకా అహంకారం మాత్రం తగ్గలేదని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక శాసనమండలిని రద్దు చేయమని తాము ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను గట్టిగా కోరుతామని ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. మొత్తంగా చంద్రబాబు, లోకేష్, యనమలపై రోజా తనదైన స్టైల్లో వేసిన పంచ్‌డైలాగులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.