ఖాకీ డ్రెస్సు వేసుకున్న కేడీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై దాడి చేసిన రామచంద్రపురం ఎస్సైని డిస్మిస్ చేయాలన్నారు. ఎస్సై నాగరాజు దాడిలో గాయపడి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జక్కంపూడి రాజాను సోమవారం ముద్రగడ పరామర్శించారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. నాయకులకే దిక్కులేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ఈ సందర్భంగా ముద్రగడ ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి తెలిసే ఇవన్నీ జరుగుతున్నాయా అని అడిగారు.
కాగా, జక్కంపూడి రాజాపై ఎస్సై నాగరాజు దాడికి నిరసనగా వైఎస్సార్సీపీ రామచంద్రాపురం బంద్ చేపట్టింది. ఎస్సై నాగరాజుపై కేసు నమోదు చేయాలని వైఎస్సార్సీపీ నేతలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
అనకాపల్లిలోనూ నిరసన
జక్కంపూడి రాజాపై ఎస్సై దాడిని ఖండిస్తూ విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో వైఎస్సార్సీపీ యువజన విభాగం నేతలు నిరసనకు దిగారు. రామచంద్ర ధియేటర్ జంక్షన్ వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. జి. రమేశ్, సోమినాయుడు, వేగి త్రినాథ్, మల్లా రామచంద్రరావు తదితరులు నిరసన కార్యక్రిమంలో పాల్గొన్నారు.