2024 సంవత్సరం నాటికి ప్రతిఇంటికి సురక్షిత తాగునీటిని అందించాలనుకుంటున్న కేంద్రప్రభుత్వ లక్ష్యాన్ని అందరికంటే ముందే తెలంగాణ రాష్ట్రం సాధించిందని కేంద్ర జల్‌జీవన్ మిషన్ టాస్క్‌ఫోర్స్ బృందం ప్రశంసించింది. ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం, ఇంజినీర్లు ప్రదర్శించిన శ్రద్ధ అభినందనీయమని పేర్కొన్నది. మిషన్ భగీరథతో నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ బాధితులకు న్యాయం జరిగిందని, రాబోయే రోజుల్లో మిగతా రాష్ట్రాలకు ఈ ప్రాజెక్టు నిధుల కోసం అమలుచేసిన ఫైనాన్షియల్ విధానం మోడల్‌గా నిలువనున్నదని మెచ్చుకున్నది. 2024 నాటికి దేశవ్యాప్తంగా ప్రతిఇంటికి సురక్షిత తాగునీటిని అందించాలనే కేంద్రప్రభుత్వం లక్ష్యసాధనలో భాగంగా నలుగురు సభ్యుల జాతీయబృందం తెలంగాణలో పర్యటిస్తున్నది.
ఈ నెల 17 నుంచి మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఈ బృందం క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. మిషన్ భగీరథ నీటిశుద్ధి కేంద్రాలు, ఇంటెక్‌వెల్స్‌ను సందర్శించింది. గ్రామాల్లో భగీరథ నీటిని ఉపయోగిస్తున్న ప్రజలను కలిసి అభిప్రాయాలను సేకరించింది. సోమవారం ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో ఈఎన్సీ కృపాకర్‌రెడ్డితో అధికారుల బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా మిషన్ భగీరథ ప్రాజెక్టు స్వరూపం, లక్ష్యాలను జలజీవన్ టాస్క్‌ఫోర్స్‌కు భగీరథ అధికారులు వివరించారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భగీరథ ప్రాజెక్టు ఫొటోలు, తాగునీరు సరఫరా అవుతున్న ఆవాసాల్లోని ప్రస్తుత పరిస్థితిని తెలియజేశారు. తెలంగాణ పనితీరు గర్వకారణం .ప్రజలందరికీ సురక్షిత తాగునీటి సరఫరా చిన్న విషయమైనా.. 70 ఏండ్ల స్వాతంత్య్ర భారతంలో ఇప్పటిదాకా సాధ్యం కాలేదని గుజరాత్ వాస్మో ప్రాజెక్టు మాజీ డైరెక్టర్ ఆర్కే సుమ అన్నారు. 2024 నాటికి ఇంటింటికి నల్లాతో తాగునీటిని అందిస్తామని ఇప్పుడు కేంద్రం అంటున్నది కానీ, తెలంగాణ ప్రభుత్వం దీనిని ఎప్పుడో సాధించిందని, ఇది గర్వించాల్సిన విషయమని చెప్పారు.
‘నల్లగొండ ఫ్లోరైడ్ గ్రామాల్లో పర్యటించాం. మిషన్‌భగీరథ నీటిని ఉపయోగించిన 15 రోజుల్లోనే స్పష్టమైన మార్పు కనిపించిందని బాధితులు చెప్పారు. సొంతంగా నిలబడటం, నడువడం చేస్తున్నామన్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. నల్లగొండ ఫ్లోరైడ్ బాధితులకు సురక్షితనీటిని సరఫరా చేస్తున్న ఇంజినీర్లకు అభినందనలు’ అని వాష్ స్పెషలిస్ట్ అవినాశ్‌జుస్తి చెప్పారు. ఈ ప్రాజెక్టు నిధుల కోసం అమలుచేసిన ఫైనాన్షియల్ మోడల్ రాబోయే రోజుల్లో మిగతా రాష్ట్రాలకు రోల్‌మోడల్‌గా మారుతుందని అన్నారు. తాగునీటి పథకం కోసం బ్యాంకుల నుంచి రుణాలు సేకరించాలనే ఆలోచన దేశంలోనే తొలిసారి అని తెలిపారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు కోసం వేసిన సరఫరా వ్యవస్థ, నాణ్యత అత్యుత్తమంగా ఉన్నదని అవినాశ్ ప్రశంసించారు. ప్రజారోగ్య విభాగం మాజీ చీఫ్ ఇంజినీర్ మోహన్ మాట్లాడుతూ.. ఇన్నేండ్ల తర్వాత నల్లగొండ ఫ్లోరైడ్ బాధితులకు న్యాయం జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ఇంజినీర్లు చేసిన మేలును అక్కడి ప్రజలు ఎన్నటికీ మరిచిపోరని చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్, చీఫ్ ఇంజినీర్లు విజయ్‌పాల్‌రెడ్డి, విజయ్‌ప్రకాశ్, వినోభాదేవి, చిన్నారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, చక్రవర్తి, శ్రీనివాస్‌రావు, కన్సల్టెంట్లు నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.