అపరిచితుడు సిన్మా క్లైమాక్స్ సీన్ గుర్తుందా…హీరో విక్రమ్ ఒకే క్షణంలో రామూగా, రెమోగా, అపరిచితుడిలా మారిపోతు నటిస్తుంటే…పోలీస్ అధికారి అయిన ప్రకాష్ రాజ్ వణికిపోతూ….ఒరేయ్ నేను ఎన్టీఆర్‌ను చూశా..ఏయన్నార్‌ను చూశా..శివాజీ గణేషన్‌ను చూశా..ఎంజీఆర్‌ను చూశా…నీలాంటి మహానటుడిని చూడలేదురా అంటాడు..సేమ్ టు సేమ్ పాలిటిక్స్‌లో అపరిచితుడిగా మారిన పవన్ కల్యాణ్‌ను చూసి ఎర్రన్నలు మీ అంత నటుడిని చూడలేదు అని వాపోతున్నారు. పాపం ఎర్రన్నలు…పవన్ గడ్డం పెంచుకుని, స్టేజీ మీద వూగిపోతుంటే..మరో చేగువేరా..అనుకున్నారు..పబ్లిక్ మీటింగ్‌లలో మిలటరీ డ్రెస్‌లు వేసుకుని, రెడ్ షర్ట్స్ ఆర్మీలా కవాతులు చేస్తుంటే…మరో ఫైడల్ క్యాస్ట్రో అని ఫీలయ్యారు. అందుకే పవన్ చెంత చేరారు…అయితే పవన్ మాత్రం ఎన్నికల సమయంలో వాళ్ల చెవిలో పువ్వులు పెట్టి..తన పార్టనర్ చంద్రన్నకు లోపాయికారీగా సహకరించారు.
తీరా ఎన్నికల తర్వాత కానీ..ఎర్రన్నలకు పవన్ కల్యాణ్ సినిమాల్లోనే కాదు..రాజకీయాల్లో కూడా మహానటుడు అని అర్థం కాలేదు.. ఇప్పుడు పవన్ కల్యాణ్ ఎర్రన్నల చెవిలో తామర పువ్వు పెట్టేసి..తాను కాషాయగూటిలో చేరిపోయాడు..ఏ గూటి చిలక ఆ గూటి పలుక పలుకుతుందనే నానుడికి తగ్గట్టుగా పవన్ ఇప్పుడు కాషాయపలుకులు పలుకుతున్నాడు..భారతీయ జనతా పార్టీ(బీజేపీ) భావజాలం, తమ పార్టీ భావజాలం ఒక్కటేనని పవన్ చెబుతున్నాడు..ప్రత్యేక ప్యాకేజీ గురించి బీజేపీ నేతలు వివరిస్తుంటే దానివల్ల ఎంత ఉపయోగమో తెలిసిందని పవన్ అంటుంటే ఎర్రన్నలు నోరెళ్లపెడుతున్నారు.. పనిలో పనిగా..మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గతంలో ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారని పవన్ గుర్తు చేశాడు. ప్యాకేజీని పాచిలడ్డూలు అన్న పవన్‌కు ఇప్పుడు కాషాయగూటికి చేరేసరికి అవి కాస్త తిరుపతి లడ్డూ అంత పవిత్ర ప్రసాదంగా మారిపోయాయి. పాపం ఎర్రన్నలు నిన్నటిదాకా..మా చేగువేరా…మా ఫైడల్ క్యాస్ట్రో అనుకున్న పవన్ మరో వీరసావర్కర్ అయిపోయాడే అని నెత్తిన ఎర్రగుడ్డ వేసుకుని కుమిలిపోతున్నారు. .2014 ఎన్నికల తరువాత బీజేపీతో ఏర్పడిన కమ్యూనికేషన్ గ్యాప్ ఇప్పుడు తొలగిపోయిందని పవన్ చెబుతున్నాడు.. అదేంటీ నిన్నటిదాకా వామపక్షాలతో పొత్తు పెట్టుకుని..ఇప్పుడు బీజేపీతో ఎలా పొత్తుపెట్టుకుంటారు..అంటే పవన్‌కు ఎక్కడో కాలింది. నేనేమైనా వామపక్షాలకు బాకీ ఉన్నానా అంటూ విరుచుకుపడ్డాడు.
అసలు పవన్ కల్యాణ్ తన పార్టనర్ బాబూ అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు. 2004లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు..2009 వచ్చేసరికి ఎర్రన్నలతో చేతులు కలిపి ఎర్రబాబు అయ్యాడు..ఆ ఎన్నికల్లో వైయస్ దెబ్బకు ఎర్రి బాబు అయ్యేసరికి 2014 ఎన్నికలకు ఎర్ర బాబు కాస్తా మళ్లీ కాషాయం బాబా అయిపోయారు. ఇప్పుడు సేమ్ సేమ్ పవన్ కూడా 2014 లో కాషాయనాథులతో కలిసిపోయి కాంగ్రెస్ హఠావో అన్నాడు..2019 ఎన్నికలలో ఎర్రన్నలతో కలిసి పోటీ చేసి వాళ్లను వెర్రోళ్లను చేశాడు. ఇప్పుడు ఏడాది తిరగకముందే మళ్లీ కాషాయగూటిలో చేరిపోయారు. మొత్తంగా నిన్నటిదాకా ఎర్రని బొట్టు పెట్టుకున్న పవనూ..ఇప్పుడు నుదుట కాషాయ సింధూరం దిద్దుకోనున్నాడు..నిన్నటి దాకా జనాలు విసిరిన ఎర్ర కండువాలకు బదులుగా పవన్ భుజంపై కాషాయ కండువా వచ్చి చేరింది..పాపం జనసైనికులకు ఎంత కష్టం వచ్చింది…అర్జెంట్‌గా ఎర్ర కండువాలన్నీ మూలనపడేసి కాషాయకండువాలు కొనుక్కోవాల్సి వచ్చింది. నిజంగా తమ చెవిలో తామరపువ్వులు పెట్టేసిన పవన్ నటనాచాతుర్యాన్ని చూసి ఎర్రన్నలు నోరెళ్లపెడుతున్నారు..ఎంతైనా బాబుతో దోస్తానా కదా…బాబు రూట్లోనే పవన్ వెళుతున్నాడు.. మధ్యలో ఎర్రన్నలే వెర్రోళ్లు అయ్యారు…ఇదే పవన్ నయా కాషాయఇజం..చూసి తరిద్దాం.