రాజధాని రైతులకు ఇచ్చిన హామీలను వైసీపీ ప్రభుత్వం నెరవేరుస్తుందని పురపాలక శాఖమంత్రి బొత్స సత్యన్నారాయణ స్పష్టంచేశారు.. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు కొనసాగుతాయని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు. ఇవేకాకుండా మీకు ఏమైనా సమస్యలుంటే చెప్పాలని, వాటిని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని బొత్స భరోసా ఇచ్చారు. రైతులతో ఎలాంటి అంశాన్నైనా చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో రాయపూడి, మందడం, లింగయ్యపాలెం, మల్కాపురం తదితర గ్రామాలకు చెందిన రైతులని విజయవాడలో ఆయన నివాసంలో కలుసుకున్నారు.
భూముల క్రయవిక్రయాలపై ఉన్న ఆంక్షల కారణంగా, ఇంట్లో పెళ్లిల్లు, ఇతరత్రా అవసరాలకు , భూములను అమ్మలేకపోతున్నామని, దాంతో ఆర్ధికపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు వివరించారు. లంక ప్రాంతాల్లోని భూముల సమస్యలను ప్రస్తావించారు. అసైన్డ్ భూముల విక్రయాల రిజిస్ట్రేషన్ రద్దుచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తాము ఎదుర్కొంటున్న సమస్యలను కూడా రైతులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని, అభివృద్ధి పనులకు వినియోగించని, తమ భూములను తిరిగి ఇచ్చే ఆలోచన చేయాలని రైతులు విజ్ఞప్తిచేశారు. వీటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళతానని మంత్రి బొత్స హామీఇచ్చారు.