విశాఖకు మెట్రో ప్రాజెక్టుకు ఒక్కో అడుగూ ముందుకు పడుతోంది.. మెట్రో కారిడార్ విస్తీర్ణాన్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. గతంలో తొలిదశలో 42 కిలో మీటర్లు మాత్రమే ప్రపోజల్స్ ఉండేవి. కానీ గాజువాకతో ఆపెయ్యకుండా స్టీల్‌ప్లాంట్ వరకూ పొడిగించాలన్న డిమాండ్ తో ఈ ప్రాజెక్టుని మరో 4 కిమీ మేర విస్తరిస్తూ 46.40 కిమీ పెంచారు. దీంతో గతంలో 8 కారిడార్లు మాత్రమే ఉండేవి.. విశాఖలో పెరుగుతున్న జనాభా, అవసరాల దృష్ట్యా.. కారిడార్ల సంఖ్య కూడా మొత్తం 10కి చేరకుంది. మొత్తం 140.13 కి.మీ వరకూ మెట్రో రైలు పొడిగించారు. దీంతో పాత టెండర్లను రద్దుచేసిన ప్రభుత్వం కొత్తగా రీటెండర్లని పిలవాలంటూ ఏఎంఆర్‌సీకి సూచిస్తూ ఇటీవలే ఉత్తర్వులు జారీచేసింది. ప్రాజెక్టులో మార్పులు, చేర్పులు చేసిన నేపథ్యంలో మెట్రో రైలు పనుల్ని వీలైనంత త్వరలో ప్రారంభించేందుకు అవసరమైన విధివిధానాల్ని సిద్ధం చెయ్యాలని సూచిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం అమరావతిలో సమీక్ష నిర్వహించారు.