ఏపీకి మూడు రాజధానుల అంశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని ఉండాలని గగ్గోలు పెడుతున్నారు. అమరావతి ముద్దు..మూడు రాజధానులు వద్దు అంటూ నినదిస్తూ..రాజధాని గ్రామాల రైతులను రెచ్చగొడుతున్నారు. అమరావతి ప్రాంతంలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలు పాల్గొంటూ రాజధాని వివాదానికి మరింత ఆజ్యం పోస్తున్నారు. కాగా వైజాగ్‌లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటును ఉత్తరాంధ్ర టీడీపీ నేతలంతా స్వాగతిస్తూ..ఓ తీర్మానం చేసి చంద్రబాబుకు పంపించారు. అయితే బాబు మాత్రం వైజాగ్‌లో రాజధాని ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమరావతిలోనే అసెంబ్లీ. సెక్రటేరియట్, హైకోర్ట్‌తో సహా అన్నీ ఇక్కడే ఉండాలని చంద్రబాబు వాదిస్తున్నారు. ఇక మూడు రాజధానులపై ఎల్లోమీడియా కూడా పచ్చకథనాలు వండివారుస్తున్నాయి. ముఖ్యంగా విశాఖలో రాజధాని ఏర్పాటును వ్యతిరేకించడమే పనిగా ఎల్లోమీడియా ఛానళ్లు. పత్రికలు విషం కక్కుతున్నాయి. విశాఖ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు దూరమని, అలాగే తరచుగా విశాఖకు తుఫానుల ప్రమాదం ఉంటుందని, నేవి అధికారులపై హానీ ట్రాప్ జరుగుతుందని, రక్షణా పరమైన ఇబ్బందులు వస్తాయని పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయి.
అయితే తాజాగా వైజాగ్‌లో రాజధాని ఏర్పాటుపై జరుగుతున్న అసత్య ప్రచారంపై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ ఫైర్ అయ్యారు. ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందడం చంద్రబాబు నాయుడుకు ఇష్టం లేదని విమర్శించారు. గతంలో నమ్మి గెలిపించిన ఉత్తరాంధ్ర ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. అసలు అమరావతిలో చంద్రబాబు ఎందుకు ఆందోళనలు చేయిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎక్కడా అమరావతి నుంచి రాజధాని తరలిస్తామని చెప్పలేదని స్పష్టం చేశారు. కేవలం తప్పుడు వార్తలతో ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు పచ్చ మీడియా కుట్ర చేస్తుందని గుడివాడ ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు విశాఖ దూరమని చెప్పే పత్రికలు.. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ దూరమని ఎందుకు రాయలేదని ఆయన ప్రశ్నించారు. నిజానికి ఏపీలో అన్ని ప్రాంతాలకు హైదరాబాద్ కంటే..వైజాగ్ దగ్గర. అదే ఉమ్మడి రాష్ట్రంలో సుదూరం ప్రాంతంలో ఉన్న చిత్తూరు, నెల్లూరు, విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం నుంచి రాజధాని హైదరాబాద్‌కు 70 ఏళ్ల పాటు తిరిగాం..ఇప్పడు హైదరాబాద్ కంటే..విశాఖ దూరమా…అని అమర్‌నాథ్ ప్రశ్నించారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని అమర్‌నాథ్ అన్నారు. కానీ చంద్రబాబు మాత్రం విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. చెన్నై, హైదరాబాద్‌లో రాజధాని ఉంటే బాధ పడ్డామా.. అసలు విశాఖ అంటే ఎందుకంత ద్వేషం అని చంద్రబాబును ప్రశ్నించారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి.. అమరావతిలోని తన భూములు కాపాడుకోవడానికి బాబు తాపత్రయ పడుతున్నారని అమర్‌నాథ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా వైజాగ్‌లో రాజధాని ఏర్పాటును వ్యతిరేకిస్తూ.. చంద్రబాబు, ఎల్లోమీడియా చేస్తున్న కుట్రలను వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ తీవ్రంగా ఎండగట్టారు.