ప్రజా సంకల్ప పాదయాత్రలో నేను విన్నాను, నేను చూశాను, నేను ఉన్నాను అంటూ చెప్పిన ప్రతీ మాటను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిజం చేస్తున్నారు. నవరత్నాల హమీలలో మరో కీలక హమీని నెరవేర్చేందుకు రంగం సిద్దమైంది. చదువుకు పేదరికం ఆటంకం కాకూడదన్న ఆలోచనతో జగన్ ప్రకటించిన అమ్మఒడి కార్యక్రమం ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మఒడిని ఈనెల 9న చిత్తూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు.అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న అమ్మఒడి పథకానికి ప్రభుత్వం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. ‘జగనన్న అమ్మఒడి’ పథకంగా పిలవబడే ఈ స్కీమ్ నవరత్నాల్లో కీలకమైనది.
పిల్లలను బడికి పంపే ప్రతి అమ్మ బ్యాంక్ అకౌంట్లో సంవత్సరానికి రూ.15వేలు వేస్తామని జగన్ ఇచ్చిన హామీ మహిళలను విశేషంగా ఆకట్టుకుంది. ఈ పథకాన్ని ముందుగా 1–10 తరగతుల విద్యార్థులకు ప్రవేశపెట్టినా.. ఇంటర్ వరకు వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిద్వారా దాదాపు 43 లక్షల మంది తల్లులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం బడ్జెట్లలో ఈ పథకానికి రూ.6,455.80కోట్లు కేటాయించారు. అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రయివేట్ జూనియర్ కళాశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు వర్తిస్తుంది. ప్రతి ఏటా జనవరిలో నేరుగా అన్ ఇన్ కంబర్డ్ బ్యాంక్ అకౌంట్లలో జమ చేయనున్నారు. ఈ పథకం వల్ల డ్రాపౌట్లు తగ్గుతాయి. పేద కుటుంబంలోని ప్రతి పిల్లాడికి విద్య అందడం ద్వారా ఆయా కుటుంబాలు వద్ధి చెందుతాయి.