ఏపీకీ మూడు రాజధానుల ఏర్పాటుపై వైసీపీ సర్కార్ నియమించిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) కమిటీ రెండు ఆప్షన్లతో కూడిన నివేదికను సీఎం జగన్‌కు సమర్పించింది. రాష్ట్ర సమగ్ర, సమతుల్య అభివృద్ధికి పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణే ఏకైక మార్గమని బీసీజీ తన నివేదికలో పేర్కొంది. న్యాయ, శాసన, పరిపాలన వ్యవస్థలను వికేంద్రీకరిస్తూ రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. దీంతో అమరావతిలో రాజధానిని ప్రభుత్వం తరలిస్తుందంటూ ఆందోళనలు ఉధృతం అయ్యాయి. సన్నబియ్యం సన్యాసి రాసిన నివేదిక బీసీజీ కమిటీ అని టీడీపీ ఎంపీ కేశినేని లాంటి నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీజీ కమిటీ నివేదికపై మంత్రి మోపిదేవి వెంకట రమణ స్పందించారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ…గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకూడదని..అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని బీసీజీ కమిటీ స్పష్టంగా చెప్పిందని అన్నారు. ఇక బీసీజీ కమిటీపై టీడీపీ నేతల విమర్శలపై మోపిదేవి స్పందించారు. బీసీజీ కమిటీ మీద కొందరు అవాకులు చవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే బీసీజీ కమిటీ గతంలో చంద్రబాబుతోనూ కలిసి పనిచేసిందని గుర్తు చేశారు. బీసీజీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న కమిటీ అని మోపిదేవి స్పష్టం చేశారు.
ఇక కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉందని చెప్పారు. ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతమని..అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే మంచి ఉద్దేశం సీఎం వైఎస్ జగన్‌కు ఉందన్నారు. అయితే రాజధాని ప్రాంత రైతుల్లో కొంత ఆందోళన ఉందని.. రైతులకు అన్యాయం జరగకుండా సీఎం చూసుకుంటారన్నారు. అమరావతిలో బినామీల పేరుతో చంద్రబాబు, టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేశారని, రాజధాని పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని మోపిదేవి ధ్వజమెత్తారు. ఐదేళ్ల కాలంలో కేవలం చంద్రబాబు రూ.5వేల కోట్లు ఖర్చు చేశారని..ఆ సొమ్ముకు 700 కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తుందన్నారు. లక్ష 16వేల కోట్లు పెట్టి రాజధాని కడితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏమిటని మంత్రి ప్రశ్నించారు. గత ఐదేళ్లలో రాజధాని కట్టడంలో వైఫల్యం చెందిన చంద్రబాబు ఇప్పుడు అమరావతిలో మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. జనవరి 6న హై పవర్ కమిటీ సమావేశమవుతుందని.. జీఎన్‌రావు, బీసీజీ కమిటీల నివేదికలను చట్టసభల్లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మోపిదేవి వెల్లడించారు. అమరావతికి ఎక్కడికి తరలిపోలేదు..అలాంటి అపోహలు సృష్టించవద్దని టీడీపీ నేతలకు, ఎల్లోమీడియాకు మంత్రి మోపిదేవి హితవు పలికారు. కాగా అమరావతిలోనే అసెంబ్లీ, హైకోర్ట్ బెంచ్ ఏర్పాటుతో పాటు రాజధానిగా డెవలప్ చేస్తూనే..కర్నూలు, విశాఖలను సైతం రాజధానులుగా అభివృద్ధి చేసేందుకు వైసీపీ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా మూడు రాజధానుల వ్యవహారంపై జనవరి 6 న జరిగే కేబినెట్‌తో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.