ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు చేస్తామంటూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై తెలుగు దేశం పార్టీ అమరావతిలో రైతులను రెచ్చగొడుతూ ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్న వేళ..విశాఖకు చెందిన టీడీపీ నేతలు చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. విశాఖ పట్టణాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించడానికి స్వాగతిస్తున్నట్లు టీడీపీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఈ మేరకు సీఎం జగన్ ప్రకటనపై తమ వైఖరికి తెలియజేసేందుకు విశాఖపట్నం అర్బన్, విశాఖపట్నం రూరల్ జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు సమావేశం అయ్యారు. టీడీపీఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్, వెలగపూడి రామకృష్ణ, గణబాబు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, పప్పల చలపతి రావు, పార్టీ అర్బన్ అధ్యక్షుడు రెహమాన్, రూరల్ ఆధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు, తదితరులు సమావేశమై సీఎం జగన్‌కు ప్రకటనకు మద్దతు పలికారు. అలాగే ముందుగానే విశాఖకు రాజధాని నిర్ణయాన్ని స్వాగతించిన మాజీ మంత్రి, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌రావుకు టీడీపీ ఎమ్మెల్యేలందరూ సంఘీభావం తెలిపారు. అప్పట్లో మూడు రాజధానులను స్వాగతించిన గంటాను తప్పుపట్టిన ఎమ్మెల్యే వెలగపూడి సైతం తన మనసుపు మార్చకుని గంటాకు మద్దతుగా మాట్లాడారు. వైజాగ్‌ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా మార్చడాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో స్వాగతించాల్సి వస్తోందని వెలగపూడి వ్యాఖ్యానించారు. తాజా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తీర్మానం రూపంలో పార్టీ అధినేత చంద్రబాబుకు అందజేయాలని టీడీపీ ఎమ్మెల్యేలంతా నిర్ణయించుకున్నారు. తమ వైఖరిని, క్షేత్రస్థాయిలో ప్రజల మనోభిప్రాయాలను చంద్రబాబుకు వివరించాలని తీర్మానించారు. అమరావతిలో రైతుల ఆందోళన తగ్గుముఖం పట్టిన వెంటనే చంద్రబాబుతో సమావేశం కావాలని వారు భావిస్తున్నారు. విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని, ప్రజాభిప్రాయానికి భిన్నంగా వెళ్లలేమని చంద్రబాబు వద్ద తేల్చి చెబుతామని టీడీపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. కాగా విశాఖ టీడీపీ ఎమ్మెల్యేల బాటలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం సమావేశమై సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఇప్పటికే టీడీపీ నేత, మాజీమంత్రి కొండ్రు మురళీ..వైయస్ జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు. అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉన్న ఉత్తరాంధ్రను సమగ్రంగా, సమంగా అభివృద్ధి చేయడానికి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం దోహద పడుతుందని, ఇందులో మరోమాటకు అవకాశమే లేదని కొండ్రు మురళీ కుండబద్ధలు కొట్టిన సంగతి తెలిసిందే..మొత్తంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లో అమరావతిలోనే రాజధాని ఉండాలని దగ్గరుండి ఆందోళనలు చేయిస్తే ఉత్తరాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం మూడు రాజధానుల నిర్ణయంపై సీఎం జగన్‌కు మద్దతు పలుకుతున్నారు. దీంతో మూడు రాజధానుల విషయంలో ఎలా ముందడుగు వేయాలో అర్థం కాక చంద్రబాబు తల పట్టుకున్నాడు..